RTC Workers: కేసీఆర్ రగిలించిన ఆర్టీసి నిప్పు.. గవర్నర్ పై భగ్గుమందా..?
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు వాటిని నివృత్తి చేయాలని గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్ వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాల వివరాలు లేవని పేర్కొన్నారు.

The RTC workers besieged the Raj Bhavan after the governor did not approve the merger bill of Telangana RTC government
విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. ఇలా పూర్తి వివరాలు సంక్షిప్త పరచని బిల్లు ప్రవేశపెట్టి ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పింఛన్ ఇస్తారా? అని ప్రశ్నించారు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు? అని వివరణ కోరారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను గవర్నర్ తమిళిసై సీఎస్ ను అడిగారు. ఈ బిల్లును శుక్రవారమే శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ గవర్నర్ అనుమతి లభించకపోవడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కాలయాపన చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే శనివారం రాజ్‌భవన్ వద్ద ఆందోళనలకు టీఎంయూ పిలుపునిచ్చింది.
ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి.. దీనిపై రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది . ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును గవర్నర్ క్షుణ్నంగా పరిశీలించారని తెలిపింది. సందిగ్ధత ఉన్న కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారని పేర్కొంది. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ వివరణ అవసరమని తమిళిసై సౌందర రాజన్ భావిస్తున్నారని చెప్పింది. ప్రభుత్వం నుంచి వివరణలతో కూడిన సమాధానం వెంటనే వస్తే.. బిల్లుపై గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని ఆ ప్రకటనలో వెల్లడించింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ లేని పుండును కేసీఆర్ ఇలా రణంగా మార్చారా.. ఇలా తాను ఆర్టీసీ కార్మికుల దృష్టిలో సేఫ్ జోన్ లోకి వెళ్లి బీజేపీని ఇరుకున పెట్టేందుకు గవర్నర్ పై ఇలాంటి కార్మిక ఉద్యమం పేరుతో రాజకీయ వ్యూహం రచిస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. భవిష్యత్తులో వీటిపై ఎలాంటి రాజకీయ, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.
T.V.SRIKAR