అయ్యప్ప ఆలయంలో 18 మెట్ల రహస్యం.. ఒక్కో మెట్టు ఒక్కో దేవతా రూపం

శబరిమల.. అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతోంది. వేలాది మంది భక్తులు.. హరిహర సుతుడి దర్శనానికి పోటెత్తుతున్నారు. అయితే.. అయ్యప్ప మాలధారణ, ఇడిముడితో ఉన్న భక్తులు మాత్రమే... స్వర్ణమెట్లపై నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2024 | 04:02 PMLast Updated on: Dec 07, 2024 | 4:02 PM

The Secret Of The 18 Steps In The Ayyappa Temple

శబరిమల.. అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతోంది. వేలాది మంది భక్తులు.. హరిహర సుతుడి దర్శనానికి పోటెత్తుతున్నారు. అయితే.. అయ్యప్ప మాలధారణ, ఇడిముడితో ఉన్న భక్తులు మాత్రమే… స్వర్ణమెట్లపై నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు..? ఎందుకలా..? భక్తులందరినీ ఎందుకు అనుమతించరు..? ఆ 18 మెట్లకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి..?

శబరిమల…ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు.. 41 రోజులపాటు దీక్ష చేసి.. స్వామివారిని దర్శించుకుంటారు. ఎన్నో వ్యయప్రయాసలతో 18 కొండలు దాటుకుంటూ అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటారు. అయ్యప్పదీక్ష చేపట్టిన భక్తులు 18 మెట్లు ఎక్కి… అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. ఇరుముడిని స్వామివారికి సమర్పించుకుంటారు. సాధారణ భక్తులకు మాత్రం 18 మెట్లపైకి అనుమతి ఉండదు. ఎందుకంటే.. 18 మెట్లకు ఎంతో విశిష్టత ఉంది. కఠినమైన నియమాలు పాటిస్తూ… అయ్యప్ప దీక్ష చేపట్టిన వారికి మాత్రమే 18 మెట్లపైకి ప్రవేశం ఉంటుంది. అంతటి పవిత్రమైన ఆ 18 మెట్లకు ఉన్న విశిష్టత ఏంటి…?

శబరిమల ఆలయంలో అయ్యప్పస్వామి సన్నిధానం దగ్గర 18 మెట్లు ఉంటాయి. ఆ 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. వీటిని స్వర్ణమెట్లు అని కూడా పిలుస్తారు. 18 మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుందట. మణికంఠుడు… అయ్యప్పస్వామిగా శబరిగిరిలో కొలువైయ్యేందుకు నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారాయట. పట్టబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చిన అయ్యప్పస్వామి… యోగసమాధిలోకి వెళ్లి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పురాణాలు చెప్తున్నాయి.

18 మెట్లు… దుష్టశక్తులను సంహరించేందుకు అయ్యప్పస్వామి వాడిన ఆయుధాలని కూడా చెప్తుంటారు. 18 మెట్లలో….మొదటి ఐదు మెట్లు పంచేద్రియాలు అయిన కళ్లు, చెవులు, నాసిక, నాలుక, చర్మాన్ని సూచిస్తాయి. ఆపై ఎనిమిది మెట్లు.. రాగధ్వేషాలైన తత్వం, కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, అహంకారాన్ని సూచిస్తాయట. ఆపై ఉన్న మూడు మెట్లు సత్వ, తమో, రజో గుణాలకు ప్రతీక అని అంటారు. 17, 18 మెట్లను విద్య, అజ్ఞానాన్ని సూచిస్తాయట. ఈ మెట్లను పరశురాముడు నిర్మించాడని అంటారు. 18 మెట్లు గ్రానైట్‌తో నిర్మింపబడి ఉంటాయి. వీటికి పంచలోహాలతో పూతపూశారు.

అయ్యప్ప సన్నిధానంలోని ఈ 18 మెట్లకు నమస్కరించుకుంటూ స్తోత్రాలు పఠిస్తూ ఎక్కుతారు భక్తులు. పట్టబంధాసనంలో కూర్చుని ఉన్న స్వామివారిని దర్శించుకుంటారు. మాలధారులు.. మెట్లు ఎక్కే సమయంలోనూ, దిగే సమయంలోనూ స్వామివారిని చూస్తూ కిందకు దిగుతారు. 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటే… కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.