Bala Krishna: అసెంబ్లీలో మీసాలు తిప్పిన బాలయ్య.. సినిమాల్లో చేసుకోమంటూ అంబటి కౌంటర్..
తొలిరోజే అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

The Speaker postponed the meetings in the AP Assembly as the TDP MLAs created chaos
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చజరగాలని సభాపతి తమ్మినేని సీతారాంని కోరారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిని పట్టించుకోని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. దీంతో సభ గందరగోళగా మారింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పినా వినిపించుకోలేదు టీడీపీ సభ్యలు.
ఓపిక నశించి రెచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అంబటి వైపు చూస్తూ మీసాలు తిప్పారు. దీంతో బాలకృష్ణకు అంబటి రాంబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం సినిమాల్లో చేసుకోవాలని సూచించారు. సభా సాంప్రదాయాలను గౌరవించి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ఉండేందుకు సహకరించాలన్నారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి దౌర్జన్యానికి పాల్పడటం సరైన పద్దతి కాదని హెచ్చరించారు. వైపీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఓవరాక్షన్ చేస్తున్నారని చురకలు అంటించారు. టీడీపీ సభ్యులు బల్లలు కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో బల్లలు కొడుతూ వాదనలు వినిపించుకోండి అన్నారు. అసెంబ్లీలో మీసాలు తిప్పితే ఊరుకోమని వైసీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇలా ఎంతమంది చెప్పినా వినిపించుకోని టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర గందరగోళాన్ని సృష్టించడంతో స్పీకర్ తమ్మినేని సభ వాయిదా వేశారు.