Mumbai Indians : ఐపీఎల్ లో రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్టే…
ఐపీఎల్ (IPL) 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో కొన్ని జట్లు అనూహ్యంగా ముందంజ వేస్తే మరికొన్ని చతికిలపడుతున్నాయి.
ఐపీఎల్ (IPL) 17వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో కొన్ని జట్లు అనూహ్యంగా ముందంజ వేస్తే మరికొన్ని చతికిలపడుతున్నాయి. ఆరంభ మ్యాచ్‌లలో తడబడి తర్వాత పుంజుకునే అలవాటున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కు ఈ సారి ఆ సెంటిమెంట్ రిపీట్ కావడం లేదు. తాజాగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఓటమి తర్వాత ముంబై ప్లే ఆఫ్ అవకాశాలకు దాదాపుగా తెరపడింది. అద్భుతాలు జరిగితే తప్ప లీగ్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టడం ఖాయమైంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై కింది నుంచి రెండో స్థానంలో ఉంది. బెంగళూరు, ముంబై జట్ల ఖాతాలో ఆరేసి పాయింట్లు ఉండగా.. రన్‌రేట్ కారణంగా ముంబై తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకూ 10 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడే విజయాలు సాధించగా.. ఏడింటిలో పరాజయం పాలైంది. ప్లే ఆఫ్ చేరాలంటే ఏ జట్టుకైనా కనీసం 16 పాయింట్లు ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబైకి ఇంకా నాలుగు మ్యాచ్‌లే మిగిలి ఉండగా.. అన్నీ గెలిచినా 14 పాయింట్లే అవుతాయి.
ఫామ్‌లో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రెండుసార్లు తలపడనుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), లక్నో సూపర్ (Lucknow Super) జెయింట్స్‌తోనూ తలపడనుంది. వీటిలో మూడు మ్యాచ్‌లు హోంగ్రౌండ్‌లో జరగనుండడం కలిసొచ్చే అంశమే అయినప్పటకీ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అలా గెలిచినా కూడా ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలు వీరికి అనుకూలంగా రావాలి. అప్పుడు కూడా ప్లే ఆఫ్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే మిగిలిన జట్లు కూడా సెకండాఫ్‌లో గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కథ లీగ్ స్టేజ్‌కే పరిమితం కానుంది. పలువురు సీనియర్ ప్లేయర్స్ ఫామ్‌లో లేకపోవడం, కెప్టెన్‌గా, ఆటగాడిగా హార్థిక్ పాండ్యా ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం ముంబై వైఫల్యానికి కారణంగా చెప్పొచ్చు.
రోహిత్ శర్మ (Rohit Sharma), ఇషాన్ కిషన్ (Ishan Kishan), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) అంచనాలు అందుకోలేకపోవడం ముంబైని దెబ్బతీసింది. అలాగే బౌలింగ్‌లో బుమ్రా తప్పిస్తే మిగిలిన వారంతా తేలిపోయారు. అదే సమయంలో కెప్టెన్‌గా పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బౌలర్లను సరిగా వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో భారీ మొత్తం వెచ్చించి ట్రేడింగ్‌లో గుజరాత్ నుంచి తెచ్చుకున్న పాండ్యా ఎంట్రీ ముంబైకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఫలితంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఈసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది.