Chandrababu: సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు.. ఈసారైనా ఊరట దక్కే చాన్స్ ఉందా ?
చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రిమాండు ఖైదు అనుభవిస్తున్న చంద్రబాబుకు సోమవారం కీలకంగా మారనుంది. బెయిల్ వస్తుందా.. క్వాష్ పిటీషన్ విచారిస్తారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఏపీ స్కిల్ డెలవల్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. ఆయన తరపు లాయర్లు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి క్వాష్ పిటిషన్ కాపీ అందించారు. దీని మీద ఈ నెల 25న విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. చంద్రబాబు అరెస్టును సమర్థిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు.. ఆయనకు రిమాండ్ విధించింది. దీన్ని ఖండిస్తూ.. ఆయన తరపు లాయర్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో దర్యాప్తు ఇప్పటికే చాలాదూరం వెళ్లిపోయిందన్న హైకోర్టు.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేము అంటూ.. క్వాష్ పిటిషన్ కొట్టి వేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేసిన చంద్రబాబు తరఫు లాయర్లు.. సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు.
ఆదివారం చంద్రబాబు రిమాండ్ అదనపు గడువు ముగుస్తుంది. దీంతో సోమవారం ఆయన్ని సీఐడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెడతారు. అలా జడ్జి ఆయనతో మాడ్లాడతారు. రిమాండ్ పొడిగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను కోర్టు సోమవారం విచారించనుంది. అలాగే చంద్రబాబుపై అమరావతి రాజధాని రింగ్ రోడ్డు స్కాం కేసు, ఫైబర్ నెట్ స్కాం కేసుల్లో CID దాఖలు చేసిన పీటీ వారెంట్లపై కూడా సోమవారమే విచారణ జరగనుంది. చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్‌లో సోమవారం చాలా కీలకం కాబోతోంది.
ఇదంతా ఎలా ఉన్నా.. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీం దగ్గరకు వెళ్తే.. ఏపీ ప్రభుత్వ లాయర్లు హైకోర్టులో చెప్పిన కారణాలే అక్కడ కూడా చెప్తారు. పైగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులనే ముందు పెడతారు. దీంతో కోర్టు కనీసం పిటిషన్‌ను స్వీకరించకుండానే కొట్టేసే అవకాశాలు ఉంటాయ్. అప్పుడు మొదటికే మోసం జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి సుప్రీం కోర్టులో బాబు పిటిషన్ తిరస్కరణకు గురైతే.. ఇన్నాళ్లూ బాబు పెంచుకున్న ఇమేజీ పూర్తిగా డ్యామేజ్ అవుతుందన్నది మరికొందరి వాదన.