విభీషణుడు స్వయంగా వచ్చి పూజలు చేస్తున్న ఆలయం – 12ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం

భీషణుడు.. పురాణపురుషుడు. రావణాసురుడి తమ్ముడు. సప్తచిరంజీవుల్లో ఒకరు. ఆయన ఇప్పటికీ భూమి మీద సంచరిస్తున్నాడని నమ్మేవారు ఉన్నారు. అంతేకాదు.. 12ఏళ్లకు ఒకసారి ఓ ఆలయానికి వచ్చి పూజలు కూడా చేస్తాడట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2024 | 05:08 PMLast Updated on: Dec 23, 2024 | 5:08 PM

The Temple Where Vibhishana Himself Came And Worshipped

విభీషణుడు.. పురాణపురుషుడు. రావణాసురుడి తమ్ముడు. సప్తచిరంజీవుల్లో ఒకరు. ఆయన ఇప్పటికీ భూమి మీద సంచరిస్తున్నాడని నమ్మేవారు ఉన్నారు. అంతేకాదు.. 12ఏళ్లకు ఒకసారి ఓ ఆలయానికి వచ్చి పూజలు కూడా చేస్తాడట. ఆ ఆలయం ఎక్కడుంది..? విభీషణుడుకి, ఆ ఆలయానికి ఉన్న అనుబంధం ఏంటి…?

శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం… దక్షిణ భారతదేశంలో పురాతనమైన, ప్రముఖ వైష్ణవ దేవాలయాల్లో ఒకటి. మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన ఎనిమిది క్షేత్రాల్లో మొదటిది. తమిళనాడులో కావేరీ నది ఒడ్డున నిర్మించిన మహిమాన్విత క్షేత్రం. ఆ ఆలయ స్థలపురాణంలో విభీషణుడి ప్రస్తావన ఉంది. 12ఏళ్లకు ఒకసారి విభూషణుడు స్వయంగా వచ్చి… ఆ ఆలయంలో కొలువైన రంగనాథస్వామిని దర్శించుకుని పూజలు చేస్తాడట.

అసలు విభూషణుడికి… శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి…? అంటే.. పురాణాల ప్రకారం… రావణ సంహారం తర్వాత… ఆయోధ్యలో జరిగిన శ్రీరాముని పట్టాభిషేకంలో విభీషణుడు కూడా పాల్గొన్నాడు. తిరిగివెళ్లే సమయంలో… శ్రీరాముడిని తన రాజ్యంలోనూ ఆరాధించుకునేలా వరం అడిగాడట. అప్పుడు… రాముడు… అయోధ్యను పాలించే ప్రభువులు ఇంటి దైవంగా పూజించే శ్రీరంగం విమాన విగ్రహాన్ని ఆయనకు వరంగా ఇచ్చాడట. ఆ విగ్రహాన్ని లంకా సామ్రాజ్యంలో ప్రతిష్టించాలని బయలుదేరాడు విభీషణుడు. కానీ.. దారి మధ్యలో సంధ్యా వందనం కోసం కావేరి నది గట్టున విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తాడు. ఆ తర్వాత…. విగ్రహాన్ని లేపి తీసుకెళ్లడం విభీషణుడికి సాధ్యంకాలేదు. అప్పుడు మహావిష్ణువు విభీషణుడికి కలలో కనబడి తాను ఆ ప్రదేశంలోనే కొలువై ఉంటానని చెప్పాడట. అప్పటి నుంచి ఆ ప్రదేశం శ్రీరంగంగా వ్యవహరించబడుతోంది. విభీషణుడు …. 12 ఏళ్లకు ఒకసారి స్వయంగా ఆ ఆలయానికి వచ్చి శ్రీరంగనాథుడిని దర్శించి… ఆరాధిస్తాడని అక్కడి వారు చెప్తుంటారు.

రోజూ వేలాది మంది భక్తులు.. శ్రీరంగం ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే… ముందుగా ఆలయంలోని విజయ గణపతిని, ఆ తర్వాత లక్ష్మీదేవిని దర్శించుకోవాలట. ఆ తర్వాతే స్వామి సన్నిధికి చేరుకోవాలి. ఇక్కడ స్వామివారు.. శయన భంగిమలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో రంగనాథస్వామి సన్నిధితో పాటు… 53 ఉపాలయాలు కూడా ఉన్నాయి.