గబ్బా..ఎవరికి పడేనో దెబ్బ భారత్,ఆసీస్ రికార్డులివే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ శనివారం నుంచి మొదలుకాబోతోంది. ఆసీస్ కంచుకోట గబ్బాలో జరగనున్న ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో భారత్ ఇదే గబ్బాలో కంగారూలకు ఓటమి రుచి చూపించింది. మరోసారి ఆ ప్రదర్శనను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2024 | 04:37 PMLast Updated on: Dec 13, 2024 | 4:37 PM

The Third Test Of The Border Gavaskar Trophy Is Set To Begin On Saturday

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ శనివారం నుంచి మొదలుకాబోతోంది. ఆసీస్ కంచుకోట గబ్బాలో జరగనున్న ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో భారత్ ఇదే గబ్బాలో కంగారూలకు ఓటమి రుచి చూపించింది. మరోసారి ఆ ప్రదర్శనను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అటు ఆసీస్ కూడా అడిలైడ్ టెస్ట్ గెలుపుతో సిరీస్ లో ఆధిక్యం పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే గబ్బాలో కంగారూలకు తిరుగులేని రికార్డుంది. గబ్బాలో జరిగిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా ఏడు సార్లు మాత్రమే పరాజయం పాలైంది. ఇక్కడ ఏడు టెస్టులు ఆడిన భారత్ జట్టు ఒకే ఒక్కసారి విజయం సాధించింది. రిషబ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్ తో భారత్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. 1988 తరువాత గబ్బాలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు అదే తొలిసారి.

33 ఏళ్లలో బ్రిస్బేన్‌ వేదికపై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన తొలి పర్యాటక జట్టుగా టీమిండియా నిలిచింది. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పటికీ, భారత్ చివరి ఇన్నింగ్స్‌లో 328 పరుగుల లక్ష్యాన్ని చేధించి 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ముఖ్యంగా, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 138 బంతుల్లో 89 పరుగులు చేసి, గబ్బాలో కంగారూల పొగరు దించాడు. ఇదిలా ఉంటే గబ్బా టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉండడంతో తుది జట్టులో పేసర్లే కీలకం కానున్నారు. దీంతో వీలైనంత మంది ఫాస్ట్ బౌలర్లను బరిలోకి దింపేందుకు ఇరు జట్లు రెడీగా ఉన్నాయి. సాధారణంగా గబ్బా పిచ్ పేసర్లకు స్వర్గధామం. ఆస్ట్రేలియాలో అన్ని పిచ్ లతో పోల్చుకుంటే గబ్బాలో బౌన్సీ వికెట్ ఎక్కువగా ఉంటుంది. సీజన్‌ను బట్టి పిచ్‌ల్లో మార్పులు ఉంటాయని పిచ్ క్యూరేటర్ చెబుతున్నాడు. ఎప్పటిలాగే ఈ సారి పేస్‌కు అనుకూలంగా బౌన్సీతో కూడిన పిచ్‌ ను తయారు చేశామని, బ్యాటర్లకు ఇది ఛాలెంజింగ్ వికెట్ అని తేల్చేశాడు.

సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉండగా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. గబ్బా పిచ్ పై బూమ్రా,సిరాజ్ లతో పాటు మూడో పేసర్ గా ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణలో ఒకరికి చోటు దక్కనుంది. ఒకవేళ పిచ్ ను అంచనా వేసుకుని నలుగురు పేసర్లతో బరిలోకి దిగే ఛాన్స్ కూడా ఉంది.