Tran Accident: తప్పిన భారీ రైలు ప్రమాదం..
ఒడిశా రైలు ప్రమాద ఘటన నుంచి జనాలు ఇంకా తేరుకోలేదు. రైలు ప్రయాణం అంటే భయపడుతున్నారు ఇప్పటికీ చాలామంది. చరిత్ర చూడని విషాదాన్ని మిగిల్చిన ఘటన అది. 280మందికి పైగా చనిపోగా.. వేల మంది క్షతగాత్రులుగా మిగిలారు. ప్రమాదానికి కారణాలపై ఇప్పటికీ విచారణ సాగుతోంది.
సీబీఐ కూడా రంగంలోకి దిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్య.. మరో రైలుకు భారీ ప్రమాదం తప్పింది. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెను ముప్పు తప్పింది. ఒక్క వ్యక్తి ఇచ్చిన సమాచారంలో భారీ ప్రమాదం తప్పింది. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో.. రైలు పట్టా విరిగిపోయి ఉండటాన్ని కీ మ్యాన్ గుర్తించాడు. ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వెంటనే వారు అప్రమత్తమై సంఘమిత్ర రైలును నిలిపివేశారు. సిబ్బంది హుటాహుటిన మరమ్మతులు చేపట్టారు.
ఆ తర్వాత ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు. కీ మ్యాన్ గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది. ఈ ఘటనతో సుమారు అరగంట పాటు పలు రైళ్లు ఆలస్యం అయ్యాయ్. వివిధ స్టేషన్లలో ఐదు రైళ్లను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఇటీవల అదే రైలుపట్టా విరగడంతో మరమ్మతులు చేసినట్టు తెలిసింది. రైలు పట్టా విరిగిన విషయం తెలుసుకున్న సంఘమిత్ర రైలు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ ఊపిరి పీల్చుకున్నారు.