Chandrayaan-3: చందమామ చాలా హాట్ గురూ..

చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతలను ఆదివారం ఇస్రో కేంద్రానికి గ్రాఫ్ రూపంలో పంపిన చంద్రయాన్ 3. ఈ ప్రయోగంతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 28, 2023 | 07:49 AMLast Updated on: Aug 28, 2023 | 7:49 AM

The Vikram Lander Has Reported The Temperature Of The Moons Surface And Inner Layers To Isro

చందమామ అంటూనే రంగు చూసి మోసపోయింది యావత్ ప్రపంచం. వెన్నెల, చంద్రుడు తెల్లగా ఉండటంతో చల్లగా ఉంటుంని భ్రమపడ్డారు. ఇక మన కవుల విషయానికొస్తే ప్రతి ఒక్కరూ చందమామను వర్ణిస్తూ హాయిగా ఉంటుందనేలా పాటలు రాశారు. కానీ చంద్రయాన్ 3 అలాంటి వాటికి తెరదించుతూ చంద్రమండలం దక్షిణ ధృవంపై ఉన్న ఉష్ణోగ్రతలను తాజాగా బయటపెట్టింది. జాబిల్లి ఉపరితలంపై పగటి ఉష్ణోగ్రతలు 50 నుంచి 70 డిగ్రీల వరకూ ఉంటుందని వెల్లడించింది. అయితే చంద్రుని ఉపరితలం నుంచి  లోతుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు ఇస్రో పేర్కొంది.

తొలి ప్రయత్నంలోనే విజయం..

విక్రమ్ ల్యాండర్ చంద్రుని పై అడుగుపెట్టిన నాలుగు రోజుల తరువాత చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ ను చేయడం ప్రారంభించింది. చంద్రుడికి పైనే కాకుండా 10 సెంటీ మీటర్ల లోతులో ఉన్న ఉష్ణోగ్రతలను సేకరించి గ్రాఫ్ రూపంలో పంపించింది. దీనిని ఛాస్తే పేలోడ్ అంటారు. దక్షిణ ధృవం పై కాలుమోపిన తరువాత చేపట్టిన తొలి ప్రయోగంగా తెలిపారు ఇస్రో అధికారులు. ప్రపంచానికి చంద్రుడి పై ఉన్న ఉష్ణోగ్రతల తీవ్రతను తెలిపిన తొలి దేశంగా భారత్ చోటు సంపాదించుకుంది. చంద్రుడి ఉపరితలంలోని పొరల్లోపలికి చొచ్చుకొళ్లే సామర్థ్యం ఈ పేలోడ్ కి ఉంది. దీనికోసం దాదాపు 10 సెన్సార్లను అమర్చారు. ఉపరితలం నుంచి 10 సెంటీ మీటర్ల లోతులో మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. అదే ఉపరితలం పైకి వచ్చేటప్పడికి 50 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు గుర్తించారు.

అంచనాలు తారుమారు చేస్తూ..

ఈ ప్రయోగానికి ముందు శాస్త్రవేత్తలు చంద్రుడిపై ఉష్ణోగ్రతలను 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని టూకీగా అంచనా వేశారు. కానీ వీటికి భిన్నంగా 70 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్త డారుకేశ తెలిపారు. సాధారణంగా భూమిపై కొన్ని సెంటీమీటర్ల లోతుకు వెళితే ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలు అధికంగా ఉంటాయని కానీ చంద్రుడిపై ఈ వ్యత్యాసం చాలా అధికంగా  ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో చంద్రుడి దక్షిణ ధ్రువంపై మానవులు నివసించే అవకాశం ఉన్నందున మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్దమైనట్లు వివరించారు. అలాగే చంద్రమండలం పై ఉన్న మట్టిని కూడా పరిశీలించి రానున్న రోజుల్లో ఒక స్పష్టమైన సమాచారాన్ని అందించేందుకు కృషిచేస్తున్నామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు.

మరిన్ని ప్రయోగాలకు సిద్దం..

ఈ చంద్రయాన్ కేవలం సేఫ్ ల్యాండింగ్ మాత్రమే కాకుండా అంతరిక్షంలోకి పంపినప్పటి నుంచి అనేక విషయాలలో విజయవంతంగా దూసుకుపోతోందన్నారు. ఈ విజయాన్ని స్పూర్తిగా తీసుకొని మరి కొన్ని రోజుల్లో ఆదిత్య ఎల్ 1 అనే ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పారు. దీంతో పాటూ అంగారక, శుక్ర గ్రహాలపై కూడా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. అయితే వీటికి కొంత పెట్టుబడి అవసరం అవుతుందని దేశ ప్రధానికి వీటిపై పూర్తి విశ్వాసం, దార్శనికత ఉన్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ వీటిపై కూడా అసాధారణ విజయాలు సాధించి ప్రపంచంలో మరింత గుర్తింపు సాధిస్తుందని తెలిపారు. చంద్రయాన్ విజయం పట్ల యావత్ భారతం గర్విస్తుందన్నారు.

T.V.SRIKAR