Komati Reddy Raja Gopal Reddy: మునుగోడులో రాజగోపాల్‌కు కొత్త తలనొప్పి!
బీజేపీకి బైబై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.. మునుగోడు నుంచి టికెట్ కేటాయించింది హస్తం పార్టీ.
బీజేపీకి బైబై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.. మునుగోడు నుంచి టికెట్ కేటాయించింది హస్తం పార్టీ. ఐతే మునుగోడులో రాజగోపాల్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు తెలుస్తోంది. మునుగోడు అసెంబ్లీ టికెట్ తప్పకుండా తనకే వస్తుందని ఆశించిన.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి చలమల్ల కృష్ణారెడ్డిలో ఆందోళన మొదలైంది. తనకు టికెట్ గ్యారెంటీగా వస్తుందని నమ్మకంతో ప్రచార రథాలను కూడా ఆయన సిద్ధం చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఐతే చివరి నిమిషంలో తనకు టిక్కెట్ దక్కకపోవడం, ఆ టికెట్ రాజగోపాల్ రెడ్డికి కేటాయించడంతో కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావడాన్ని స్వాగతించిన కృష్ణారెడ్డి.. మునుగోడు టిక్కెట్ తనకు ఇవ్వకపోవడాన్ని మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. రాజగోపాల్ రెడ్డి రాష్ట్రస్థాయి నేత కావడంతో.. ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవగలరని.. మునుగోడు మాత్రం తనకు వదిలి పెట్టాలని కృష్ణారెడ్డి అంటున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చానని.. అయినా రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడం తట్టుకోలేకపోతున్నానని.. అనుచరుల దగ్గర కృష్ణారెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు. రాజకీయ భవిష్యత్తుపై సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేయాలనే ఆలోచనకు కృష్ణారెడ్డి వచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని టెన్షన్ పెడుతోంది.
కృష్ణారెడ్డిని ఏ విధంగా బుజ్జగించి దారికి తెచ్చుకోవాలి అనే విషయంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట రాజగోపాల్. కృష్ణారెడ్డి మాత్రం తాను మునుగోడు నుంచే పోటీ చేసే తీరుతానని ప్రకటించడంతో.. రాష్ట్ర స్థాయి నాయకులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కృష్ణారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. మరి బుజ్జగింపులకు కృష్ణారెడ్డి లొంగకపోతే పరిస్థితి ఏంటి అనే భయం కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. కృష్ణారెడ్డి పోటీలో ఉంటే.. అది రాజగోపాల్ రెడ్డి విజయావకాశాలను దెబ్బతీసే చాన్స్ ఉంటుంది. దీంతో కాంగ్రెస్ నేతలతో పాటు.. రాజగోపాల్‌లో తెగ కంగారు మొదలైందని ప్రచారం సాగుతోంది.