Balakrishna: బాలయ్య వారాహి ఎక్కబోతున్నారా ?
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తర్వాత.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్.

There are indications that Balakrishna will participate in the Varahi Yatra
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తర్వాత.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. జనసేన, టీడీపీ మధ్య పొత్తు కన్ఫార్మ్ అని తెలిసినా.. ప్రకటన ఎన్నికల ముందు వస్తుంది అనుకున్నారు అంతా ! చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో.. ఆ ప్రకటన కాస్త ముందే వచ్చింది. రాజమండ్రి జైలు సాక్షిగా.. టీడీపీతో పొత్తు అంశంపై క్లారిటీ ఇచ్చేశారు పవన్ కల్యాణ్. కట్ చేస్తే వారాహి నాలుగో విడత యాత్ర మొదలుపెట్టారు. చంద్రబాబు అరెస్ట్ గురించి స్ట్రాంగ్ కామెంట్లు చేస్తారు.. వైసీపీని ఆడుకుంటారు అని అనుకుంటే.. వారాహి యాత్ర ఆ ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు పెద్దగా ! ఇంకా చెప్పాలంటే.. చప్పగా సాగుతోందీ యాత్ర.
దీని వెనక వ్యూహం ఉందా అంటే.. ఉండే ఉండొచ్చు.. రాజకీయాలను అంత ఈజీగా అంచనా వేయలేం మరి! ఇదంతా ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ, జనసేన ఒప్పందం కుదుర్చుకున్నాయ్. సీట్ల వ్యవహారం మరికొద్దిరోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఇక అటు పవన్ నాలుగో విడద వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో సాగుతుండగా.. జనాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. జనసేన శ్రేణులతో పాటు.. టీడీపీ కార్యకర్తలు కూడా పవన్ సభలకు భారీగా తరలివస్తున్నారు. దీంతో పవన్‌లో సరికొత్త ఉత్సాహం కనిపిసస్తోంది. మరింత జోష్‌గా స్పీచ్‌లు దంచికొడుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రచారం మొదలైంది. వారాహి యాత్రలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అలియాస్ బాలయ్య పాల్గొనబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.
వారాహి ఎక్కబోతున్న బాలకృష్ణ.. టీడీపీ, జనసేన పొత్తులపైనా, రాబోయే రోజుల్లో రెండు పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్లాలి.. ఏవిధంగా వైసీపీని అధికారానికి దూరం చేయాలనే దానిపై ప్రసంగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢీకొట్టడం.. అధికారం నుంచి దించడం అంత ఈజీ వ్యవహారం కాదు. అది టీడీపీ, జనసేన నేతలకు ఇద్దరికీ తెలుసు. జనాల నుంచి వ్యతిరేకత తీసుకువస్తేనే.. వైసీపీని ఓడించడం సాధ్యం అవుతుంది. అందుకోసమే పవన్‌తో పాటు బాలకృష్ణ కూడా వారాహి ఎక్కేందుకు సిద్ధం అయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు రెండు పార్టీల మధ్య బంధాన్ని కూడా వారాహి నుంచే జనాలకు చాటిచెప్పాలన్న ప్లాన్ కూడా ఉండి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.