Vivek Venkata Swamy: రెండు టికెట్స్.. వివేక్ అడుగులు అటువైపేనా ?
సక్సెస్ ఫుల్ మీడియా అధిపతిగా, వ్యాపారవేత్తగా.. అంతకుమించి సోనియాగాంధీ స్థాయి వారితో చనువు కలిగిన సీనియర్ పొలిటీషియన్ గా వివేక్ వెంకటస్వామికి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి కుమారుడు కావడం అతిపెద్ద ప్లస్ పాయింట్. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల రాజకీయాలపై వివేక్ కు పట్టు కూడా ఉంది. అందుకే ఆయన వస్తానంటే.. ఏ పార్టీ అయినా వెంటనే రెడ్ కార్పెట్ పరుస్తుంటుంది.
సక్సెస్ ఫుల్ మీడియా అధిపతిగా, వ్యాపారవేత్తగా.. అంతకుమించి సోనియాగాంధీ స్థాయి వారితో చనువు కలిగిన సీనియర్ పొలిటీషియన్ గా వివేక్ వెంకటస్వామికి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి కుమారుడు కావడం అతిపెద్ద ప్లస్ పాయింట్. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల రాజకీయాలపై వివేక్ కు పట్టు కూడా ఉంది. అందుకే ఆయన వస్తానంటే.. ఏ పార్టీ అయినా వెంటనే రెడ్ కార్పెట్ పరుస్తుంటుంది. ప్రస్తుతానికి బీజేపీలో ఉన్న ఆయన త్వరలోనే పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన బీఆర్ఎస్ లో చేరుతారని తొలుత ప్రచారం జరగగా.. అలాంటిదేం లేదని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. అయినా వివేక్ పార్టీ మారడంపై ప్రచారం ఆగలేదు. బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్ ను నియమించినప్పటి నుంచే పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారని కథనాలు వచ్చాయి. తనను కాదని ఈటలకు ప్రయార్టీ ఇవ్వడంపై వివేక్ గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపించింది. అయితే ఈవాదనలకు బలం చేకూర్చేలా ఓ పరిణామం చోటుచేసుకుంది. జులై 8న ప్రధాని మోడీ వరంగల్ సభకు వివేక్ హాజరుకాకపోవడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ మీటింగ్ కు విజయశాంతి, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ కూడా గైర్హాజరయ్యారు. బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన వెంటనే చోటుచేసుకున్న ఈ పరిణామం బీజేపీలోని అంతర్గత గ్రూపు రాజకీయాలను అద్దం పడుతోంది. కిషన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇచ్చినందువల్లే ఇలా జరిగి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాహుల్ డైరెక్షన్.. రేవంత్ రాయబారం
మరోవైపు రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి అందుతున్న డైరెక్షన్స్ ప్రకారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. వివేక్ వెంకటస్వామిలా ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను (కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి) మళ్లీ కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చేటందుకు రహస్య మంతనాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే వివేక్ వెంకటస్వామిని కలిసి కాంగ్రెస్ లోకి రేవంత్ ఆహ్వానించారని న్యూస్ స్టోరీస్ వచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని వివేక్ ప్రస్తుతానికి చెబుతున్నప్పటికీ.. తనకు, తన కుటుంబ సభ్యులకు తగిన అవకాశాలు కల్పిస్తే మళ్లీ రాజకీయ పుట్టినిల్లు కాంగ్రెస్ కు ఆయన చెయ్యెత్తి జైకొట్టడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
చెన్నూరు బరిలో గడ్డం వంశీ ?
మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్సీ మాల రిజర్వేషన్ ఉంది. దీంతో ఆ స్థానంపై వివేక్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి తన కుమారుడు గడ్డం వంశీని కాంగ్రెస్ తరఫున బరిలోకి దింపాలని ఆయన భావిస్తున్నట్టు లోకల్ గా టాక్ నడుస్తోంది. గతంలోకి వెళితే.. 2004 అసెంబ్లీ పోల్స్ లో వివేక్ సోదరుడు గడ్డం వినోద్ చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచే కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలిచారు. బీజేపీ గుర్తు కంటే కాంగ్రెస్ గుర్తుతో ప్రజల్లోకి వెళితే.. చెన్నూరు సెగ్మెంట్ లో గెలుపు ఈజీ అవుతుందని పలువురు సన్నిహితులు వివేక్ కు సూచించినట్టు తెలుస్తోంది. తాను గతంలో ఎంపీగా ఎన్నికైన పెద్దపెల్లి పార్లమెంట్ సీటును కూడా ఇవ్వాలని కాంగ్రెస్ ను వివేక్ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. ఈ రెండు టికెట్స్ కన్ఫర్మ్ అయితే వివేక్ కాంగ్రెస్ లోకి చేరుతారని అంటున్నారు. వచ్చే నెలలో రాష్ట్రంలో సోనియాగాంధీతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఆ సమయానికి రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూద్దాం..