China Dam: బార్డర్ లో గడబిడ.. చైనా డ్యామ్ వర్సెస్ ఇండియా ఆనకట్ట !
ఈ నది విషయంలో చైనా, భారత్ ల మధ్య తాజాగా ఉద్రిక్తత ఏర్పడింది. తమ వైపు ఉన్న బ్రహ్మపుత్ర నదిపై విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ను కడతామని చైనా అనౌన్స్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య వార్ మొదలైంది.
బ్రహ్మపుత్ర నది.. సియాంగ్ నది.. !! ఈ రెండూ ఒక్కటే.. బ్రహ్మపుత్ర నదినే అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ నది అని పిలుస్తారు. ఈ నది విషయంలో చైనా, భారత్ ల మధ్య తాజాగా ఉద్రిక్తత ఏర్పడింది. తమ వైపు ఉన్న బ్రహ్మపుత్ర నదిపై విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ను కడతామని చైనా అనౌన్స్ చేసింది. ఒకవేళ నిజంగానే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ను ఈ నదిపై నిర్మిస్తే.. ఆ ప్రభావం దిగువన ఉన్న భారత్ లోని ప్రాంతాలపై పడుతుంది. అస్సాం, బంగ్లాదేశ్ లు వరద ముంపునకు గురయ్యే రిస్క్ కూడా ఉంటుంది. ఈనేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. రాబోతున్న ముప్పును ఎదుర్కొనేందుకు సియాంగ్ (బ్రహ్మపుత్ర) నదిపై ఆనకట్ట కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోందని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ప్రకటించారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో చైనా, భారత్ ల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతున్న సియాంగ్ నది వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆనకట్టను నిర్మించి, బ్రహ్మపుత్ర నదిని కాపాడుకుంటామని అరుణాచల్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ ఆనకట్ట నిర్మాణంతో చైనా ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందా ? అని విదేశాంగ వ్యవహారాల నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
బ్రహ్మపుత్ర నది గమ్యం.. గమనం..
బ్రహ్మపుత్ర నదిని చైనా ఆక్రమిత టిబెట్ లో యార్లుంగ్ సాంగ్సో నది అని పిలుస్తారు. అక్కడే 60 వేల మెగావాట్ల భారీ డ్యామ్‌ను నిర్మిస్తామని చైనా అంటోంది. యార్లుంగ్ సాంగ్సో (బ్రహ్మపుత్ర) నది టిబెట్‌లోని హిమాలయాలలో పుట్టింది. ప్రపంచంలోనే పొడవైన నదుల్లో ఇది ఒకటి. బ్రహ్మపుత్ర నది 2,880 కి.మీల దూరం ప్రవహిస్తుంది. ఈ నది టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోకి, అక్కడి నుంచి అస్సాంలోకి ప్రవేశిస్తుంది. ఈ నది అరుణాచల్ ప్రదేశ్‌లో 300 కి.మీ దూరం ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర నది భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించాక.. చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది.
చైనా డ్యామ్ ప్రమాదకరమా?
చైనా డ్యామ్ అంశాన్ని అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లాంబో తయెంగ్ ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ జీరో అవర్‌లో చర్చకు పెట్టారు. సియాంగ్ నది ప్రవాహ దిశను పదేపదే మార్చుకుంటూ ఉంటే.. పంటలు పండే లక్షల కొద్ది హెక్టార్లు పెద్దఎత్తున కోతకు గురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నది ప్రవాహంలో వస్తున్న మార్పుల వల్లే నదీ తీరంలోని వన్యప్రాణుల అభయారణ్యం ప్రాంతం కూడా తగ్గిపోయిందన్నారు.టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు బ్రహ్మపుత్ర నది నీరు రాకుండా అడ్డుకోవడంలో చైనా హస్తం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. అరుణాచల్ లోని సియాంగ్ లోయలో చైనా చర్యల వల్ల వస్తున్న ఆకస్మిక వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి చర్యలను చేపట్టాలన్నారు. ఈ వాదనతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండు కూడా ఏకీభవించారు. సియాంగ్ నది పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళనగా ఉందన్నారు.
నిపుణులు ఏమంటున్నారో తెలుసా ?
చైనా కట్టబోతున్న 60 వేల మెగావాట్ల భారీ డ్యామ్‌పై క్లారిటీకి వచ్చిన తర్వాతే అరుణాచల్ లో నిర్మించాల్సిన ఆనకట్టపై ప్లాన్ లు రెడీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సియాంగ్ (బ్రహ్మపుత్ర) నదిపై ఏదైనా డ్యామ్ ను నిర్మించాలంటే ముందు, ఎగువ ప్రాంతంలో చైనా నిర్మించే డ్యామ్ సైజు ఎంత ఉంటుందనే దానిపై క్లారిటీకి రావాలని కోరుతున్నారు. చైనా డ్యామ్ ఎత్తు ఎంత? ఆనకట్ట నిల్వ సామర్థ్యం ఎంత? ఈ ఆనకట్ట నుంచి ఎంత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు? ఎంత వరద నీటిని కిందికి వదులుతారు? వంటి సమాచారం లేకపోతే అరుణాచల్ లో ఆనకట్ట నిర్మాణ ప్రణాళిక రెడీ చేయడం కష్టం అని నిపుణులు తేల్చి చెబుతున్నారు