Tummala Nageshwar Rao: యావత్ తెలంగాణ చూపు తుమ్మలపైనే.. బీఆర్ఎస్ లో ఉంటారా.. కాంగ్రెస్ తో చేతులు కలుపుతారా..?
తెలంగాణ రాజకీయాలు ఒక పట్టాన తేలడంలేదు. ఒకరిని బుజ్జగిస్తే మరొకరు అలక పాన్పు ఎక్కుతున్నారు. తాజాగా తుమ్మల రాజకీయంపై ఉత్కంఠ నెలకొంది. ఈయన బీఆర్ఎస్ పార్టీ వీడతారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

There is a discussion that Tummala Nageshwar Rao will join In Congress
తెలంగాణ బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కేసీఆర్ మూడు నెలల ముందుగా ప్రకటించడం పార్టీలో తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కు ఈసారి కేసీఆర్ అభ్యర్థుల జాబితాలో చోటు కల్పించలేదు. ఇతని స్థానంలో మరొకరిని నియమించడం తుమ్మలకు మింగుడుపడటం లేదు. దీంతో కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. ఇదే తరుణంలో తుమ్మలను బీఆర్ఎస్ వదులుకునేందుకు సిద్దంగాలేదు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో బలమైన నేతల్లో ఈయన కూడా ఒకరు. అయితే తుమ్మల మాత్రం తనకు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజల కోసం ఎన్నికల బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తుంది. పైగా తన అనుచరుతలో కూడా దీనిపై చర్చించినట్లు తెలుస్తుంది. దీనిపై గతంలో ఆసక్తి కరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
కాంగ్రెస్ మంతనాలు..
ఇదిలా ఉంటే తుమ్మలను తమ పార్టీలో లాక్కునేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు పోటీ పడుతున్నాయి. అయితే బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరని తెలుస్తుంది. కాంగ్రెస్ మాత్రం తుమ్మలను పార్టీలోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. పైగా తనను పార్టీలో తీసుకొని ఖమ్మం, పాలేరు ఎక్కడ నుంచి పోటీకి దింపాలన్న విషయంలో తర్జన బర్జన పడుతోంది. ఒకవేళ తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అప్పుడు పొంగులేటి, తుమ్మల ఈ జిల్లాలో ఇద్దరు కీలక నేతలుగా మారుతారు. అప్పుడు సీట్ల సర్ధుబాటు గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ ఒక స్పష్టత ఇస్తే తుమ్మలకు కాంగ్రెస్లో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ఒక వర్గం నుంచి వినిపిస్తున్న వాదన.
జనరల్ సీటు పై చర్చ
కాంగ్రెస్ అనగానే లోలోపల వర్గపోరు, ఆధిపత్యపోరు ఉంటుంది. ఒక వేళ తుమ్మల కాంగ్రెస్ లో చేరితే జిల్లా ముఖ్య నేతల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న చర్చ కూడా జోరుగా వినిపిస్తుంది. అయితే భట్టి, రేణుకా, పొంగులేటి లాంటి కీలకనేతలు తుమ్మల చేరికపై ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నమాట. ఇదే నిజమైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా లో మూడు జనరల్ అభ్యర్థుల స్థానంలో ఈ కీలకమైన నేతలను బరిలో దింపేందుకు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.
మరి ఇలాంటి పరిస్థితుల నడుమ తుమ్మలను బీఆర్ఎస్ వదులుకుంటుందా.. లేక ఏమైనా బుజ్జగింపులకు పాల్పడుతుందా.. వాటికి ఈయన లొంగుతారా.. లేక కాంగ్రెస్ ఎలాంటి హామీ ఇస్తుంది అనే అంశాల పై ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా ఈ వారంలో దీనిపై ఒక క్లారిటీ వస్తుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
T.V.SRIKAR