షమీ కోసం హోరాహోరీ, టార్గెట్ చేసిన ఫ్రాంచైజీలివే
ఐపీఎల్ మెగావేలం ఈ సారి రసవత్తరంగా ఉండబోతోంది. పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం.. కొన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు కీలక ఆటగాళ్ళను వేలంలోకి విడిచిపెట్టక తప్పలేదు.
ఐపీఎల్ మెగావేలం ఈ సారి రసవత్తరంగా ఉండబోతోంది. పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం.. కొన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు కీలక ఆటగాళ్ళను వేలంలోకి విడిచిపెట్టక తప్పలేదు. ఆర్టీఎం ద్వారా తిరిగి దక్కించుకునే వీలున్నప్పటకీ పలువురు స్టార్ ప్లేయర్స్ కోసం గట్టిపోటీనే నడవబోతోంది. ఈ జాబితాలో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఉన్నాడు. మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫాస్ట్ బౌలర్ 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చాడు. షమీ కోసం వేలంలో భారీగా బిడ్డింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. గాయం నుంచి కోలుకున్న షమీ రంజీ మ్యాచ్ లో సత్తా చాటాడు.దీంతో ఫ్రాంచైజీల కన్ను షమీపై పడింది. ప్రధానంగా మూడు జట్లు షమీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. షమీని టార్గెట్ చేస్తున్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుంది. నిజానికి షమీ ఐపీఎల్ కెరీర్ కేకేఆర్‌తోనే ప్రారంభించాడు. అయితే కేవలం ఒక సీజన్ మాత్రమే కేకేఆర్ తరుపున ఆడాడు. ఇప్పుడు బెంగాల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీని కేకేఆర్ ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తుంది.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా షమీపై కన్నేసింది. గతంలో 2014 నుండి 2018 వరకు 5 సీజన్ల పాటు ఢిల్లీ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించాడు. అటు చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తుంది. దీపక్ చాహర్ ను వదిలేసిన సీఎస్కేకు షమీ లాంటి బౌలర్ అవసరం ఉందనే చెప్పాలి. కొత్త బంతితోనే కాకుండా పాత బంతితోనూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టడంలో షమీ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ విషయాన్ని చెన్నై మాజీ కెప్టెన్ ధోనీకి బాగా తెలుసు. అందుకే షమీని తీసుకోవాలనే ప్లాన్ సీఎస్కే కూడా ఉంది.
ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో ప్రతీసారి బౌలింగ్ డిపార్ట్ మెంట్ వీక్ గా ఉండే జట్టు ఏదైనా ఉందంటే అది బెంగళూరే… స్టార్ బౌలర్లున్నా అంచనాలు అందుకోలేకపోవడం ఆర్సీబీకి ప్రధాన సమస్య. ఈ సారి వేలంలో షమీ కోసం బెంగళూరు ఫ్రాంచైజీ కూడా ట్రై చేస్తుందని సమాచారం. పేస్ ఎటాక్ లో ఒక ఎక్స్ పీరియన్స్ బౌలర్ ఉండడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చాలా అవసరం.. అందుకే షమీపై ఆర్సీబీ కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్ వేలంలో షమీ కోసం మళ్ళీ బిడ్ వేసే అవకాశాలు లేకపోలేదు. గుజరాత్ తొలిసారి టైటిల్ గెలిచినప్పుడు షమీ పాత్ర చాలానే ఉంది. ఓవరాల్ గా షమీ రికార్డును చూస్తే 77 మ్యాచ్ లలో 79 వికెట్లు పడగొట్టాడు.