Kishan Reddy: అధ్యక్షుడి హోదా ఇచ్చి కిషన్‌రెడ్డిని బలిపశువు చేస్తున్నారా ?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. బండిని పక్కకు తప్పించి.. కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడం ఆసక్తి రేపుతోంది. పార్టీలో ఎలాంటి మార్పులు వస్తాయ్.. రాజకీయాన్ని ఈ మార్పు ఎలా ప్రభావితం చేస్తుందన్న సంగతి పక్కనపెడితే.. అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి అంత ఆసక్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు.
బీజేపీ హైకమాండ్ నుంచి ప్రకటన వచ్చిన 24గంటల తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. అలక లేదు అన్నారు కానీ.. హ్యాపీగా ఉన్నానో లేదో మాత్రం చెప్పలేదు. దీంతో అధ్యక్ష పదవిపై ఆయన అంత సానుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. మరో రెండు రోజుల్లో తెలంగాణలో ప్రధాని మోదీ సభ జరగబోతోంది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆ సభను సక్సెస్ చేయడం మీద దృష్టిసారించబోతున్నారు. రాష్ట్ర నేతలతో సమన్వయం చేసుకొని.. తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి.. పార్టీని పరుగులు పెట్టిస్తారా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. పదవి కట్టబెట్టి ఆయనను బలిపశువు చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. పార్టీలో జరుగుతున్న డ్రామాకు కిషన్ రెడ్డి బలి అయ్యారనే ప్రచారం జరుగుతోంది. రెండు రకాలుగా ఇప్పుడు కిషన్ రెడ్డి దెబ్బ పడినట్లే ! మొదటిది.. కేంద్రమంత్రి పదవి కోల్పోవడం. రెండోది తెలంగాణ పరిణామాల విషయంలో ! సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టడం అంటే.. ఆయనను బలి చేసినట్లే ఒకరకంగా అనే చర్చ జరుగుతోంది.
ఈ మూడు నెలల్లో పార్టీని ఎలా కో ఆర్డినేట్ చేసుకుంటారు.. ఎన్నికలకు ఎలా సిద్ధం చేస్తారన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోకపోయినా.. గౌరవప్రదమైన పోటీ ఇవ్వకపోయినా.. అభాండాలను మోయాల్సింది, ఓటమికి బాధ్యత తీసుకోవాల్సింది కిషన్‌రెడ్డే అవుతారు. అసలే బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయనే ప్రచారం జరుగుతోంది. అలాంటిది వచ్చే ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ బాగోలేకపోతే.. ఆ ప్రచారం మరింత బలపడే చాన్స్ ఉంటుంది. అదే జరిగితే.. దాన్ని మోయాల్సింది కూడా కిషన్‌రెడ్డే ! ఇలా ఎలా చూసినా.. కిషన్‌రెడ్డి బలిపశువుగా మారడం ఖాయం అన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం.