Chandrababu: చంద్రబాబు అరెస్ట్ మొదలు మధ్యంతర బెయిలు వరకూ జరిగిన పరిణామాలు ఇవే..

తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్ట్ అయినప్పటి నుంచి ఏపీలో చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మధ్యంతర బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 31, 2023 | 02:24 PMLast Updated on: Oct 31, 2023 | 2:24 PM

These Are The Developments That Happened From Chandrababus Arrest To Interim Bail

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 9న సీఐడీ అధికారులు నంద్యాలలో అరెస్ట్ చేశారు. అయితే 53 రోజుల తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే బాబు అరెస్ట్ అయినప్పటి నుంచి నేటి వరకూ జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం.

అరెస్ట్ ఇలా..

చంద్రబాబు నాయుడు నంద్యాలలో బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఆ తరువాత రాత్రి అక్కడే బస చేశారు. ఉదయాన్నే సీఐడీ అధికారులు చంద్రబాబు బస చేస్తున్న బస్సు వద్దకు చేరుకుకున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో విచారణకు సహకరించాలని అందుకే అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ముందుగా అరెస్ట్ ను ఒప్పుకోని చంద్రబాబు చాలా సేపు సంభాషణ తరువాత ఒప్పుకున్నారు. రోడ్డుమార్గంలో విజయవాడకు చేరుకున్నారు. మార్గమధ్యమంలో కొన్ని చెదురుమొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారు కార్యకర్తలు. అయితే మరుసటి రోజు ఉదయం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు సీఐడీ అధికారులు.

తొలి రిమాండ్..

నంద్యాలలో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సుమారు గంటల తరబడి ఇరుపక్షాల లాయర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు. చివరకు సాయంత్రం 7 గంటల సమయంలో 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు పోలీసులు. సుమారు అర్థరాత్రి 2గంటల సమయంలో రాజమండ్రి కేంద్ర కారాగారంలోకి వెళ్లారు చంద్రబాబు. అప్పటి నుంచి బెయిల్ తోపాటూ పలు రకాల పిటిషన్లు వేశారు. కొన్నింటికి అనుమతిచ్చింది ఏసీబీ కోర్టు. ఆయన అనారోగ్య పరిస్థితులు, భద్రత దృష్ట్యా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఇంటి భోజనం, ప్రత్యేక గది, ఫ్యాను, బెడ్, ఫ్రిజ్, టీవీ లాంటివి ఏర్పాటు చేశారు. నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఆయనక ప్రత్యేక భద్రతను కల్పించారు. ఈ క్రమంలో మొదటి ములాఖత్ లో భాగంగా ఆయన సతీమణి, కుమారుడు, కోడలు వెళ్లి కలిసారు. అక్కడి పరిస్థితులపై మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు.

క్వాష్ పిటిషన్..

రాజమండ్రి సెంట్రల్ జైలులో వెళ్లిన మూడు రోజులకు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాము కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిని తిరస్కరించింది ఏపీ హైకోర్టు. క్రింది కోర్టులు ఇచ్చిన తీర్పులను కొట్టివేస్తూ, దర్యాప్తులో ఉన్న కేసులపై క్వాష్ చేయలేమని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన క్వాష్ పిటిషన్ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు న్యాయవాదులు. ఈలోగా ముందుగా ఏసీబీ కోర్టు ఇచ్చిన 14 రోజుల రిమాండ్ గడువు ముగిసింది. దీంతో మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు టీడీపీ న్యాయవాదులు. దీనిన తిరస్కరిస్తూ మరో 11 రోజుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ న్యాయస్థానం. ఈ క్రమంలోనే సుప్రీంలో మెన్షనింగ్ దాఖలు చేయాలని సూచించింది. ప్రముఖ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా మెన్షనింగ్లో దాఖలు చేశారు. విచారణ చేపట్టిన వెంటనే వారం రోజులు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. హైకోర్టు తిరస్కరించిన పిటిషన్ కు సంబంధించిన పూర్తి దస్త్రాలను తనకు సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ తరువాత మరో వారానికి వాదనలు మొదలయ్యాయి.

17-ఎ పై సుదీర్ఘ వాదనలు..

సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణకు వచ్చిన తొలిరోజు నుంచి 17 – ఎ పై సుదీర్ఘ వాదనలు వినిపించారు సిద్దార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే. అవినీతి నిరోధక చట్టం వర్తించదని వాదించారు. ఈ కేసు 2018లో నమోదైందని, గవర్నర్ అంగీకారం లేకుండానే అరెస్ట్ చేశారని చెప్పారు. అయితే సుప్రీం మరోసారి వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు కూడా మరో 14 రోజుల రిమాండ్ విధించింది. సుప్రీంలో విచారణ వాయిదా అనంతరం వాదలను తిరగి ప్రారంభమయ్యాయి. జస్టీస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అవినీతి నిరోధక చట్టం 17 – ఎ పక్కన పెడితే 409తో పాటూ మిగిలిన సెక్షన్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని మరో సారి వాయిదా వేసింది. తాజాగా జరిగిన వాదనల నేపథ్యంలో క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసి ఉంచింది అత్యున్నత న్యాయస్థానం. ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టు మరో 14 రోజుల రిమాండ్ పొడిగించింది.

పవన్ కళ్యాణ్ పొత్తు..

హైదరాబాద్ నుంచి ఏపీ చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆయనతో మాట్లాడి వచ్చిన తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలు బయటకు వచ్చి టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా చర్చనీయాంశం అయింది. వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని స్వాగతించారు. భవిష్యత్ కార్యచరణలో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. నవంబర్ నుంచి వివిధ రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నవంబర్ 3న విజయవాడ వేదికగా మరోసారి భేటీ అయ్యేందుకు ప్రణాళికలు రచించుకున్నారు. దీంతో ఏపీలో జనసేన, టీడీపీతో కలిసి పనిచేస్తుంది అని స్పష్టమైంది.

టీడీపీ నిరసనలు..

చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కంచాలు మోగిస్తూ, క్యాండిల్ ర్యాలీలు, దీపాలు ఆర్పివేసి విన్నూత్నంగా నిరసనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి కూడా పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు కార్యకర్తలు. ఇటు హైదరాబాద్ లో కూడా ఐటీ ఉద్యోగులు కదం తొక్కారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కారు ర్యాలీలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ ను ఖండిస్తూ రాజమండ్రికి చేరుకున్నారు. మార్గం మధ్యలో ఆయనను పోలీసులు అడ్డుకన్నప్పటికీ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. న్యాయానికి సంకెళ్లు అనే పేరుతో కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇక నిజం గెలవాలి అంటూ నారా చంద్రబాబు అరెస్ట్ జీర్ణించుకోలేక గుండెపోటుతో చనిపోయిన కుటుంబాలను ఓదార్చేందుకు బస్సుయాత్ర చేపట్టారు నారా భువనేశ్వరి.

లోకేష్ అమిత్ షాతో భేటి..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కూడా సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని కోరారు. దీంతో ఆయనకు ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లి నోటీసులు అందించారు. ఆ తరువాత సీఐడీ అధికారుల విచారణకు సహకరించారు. ఆ తరువాత పురంధేశ్వరి, కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. తన తండ్రి కేసులో పూర్తి విషయాలు ఆయనకు తెలిపారు. రాష్ట్ర పరిస్థితుల గురించి చర్చించారు. జగన్ పాలనపై చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పాలనా తీరును వివరించారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడూ మద్దతు ఇస్తామన్నారు.

మధ్యంతర బెయిల్..

గత వారం నుంచి ప్రధాన బెయిల్ పిటిషన్ తో పాటూ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదలను వినిపిస్తున్నారు ఇరువురి తరఫు న్యాయవాదులు. సోమవారం సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వు చేసింది హైకోర్టు. రిజర్వ్ చేసిన తీర్పును మంగళవారం వెలువరిస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఐదు షరతులతో కూడిన మధ్యంతర బెయిలు ఇచ్చారు. తిరిగి నాలుగు వారాల తరువాత చికిత్స తీసుకున్న పూర్తి వివరాలతో నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావాలని చెప్పింది న్యాయస్థానం. ఈ మేరకు చంద్రబాబు హైదరాబాద్ వెళ్లేందుక తగు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసు అధికారులు. ఏసీబీ కోర్టు నుంచి విడుదలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడిన వెంటనే చంద్రబాబు ప్రత్యేక ఫ్లైట్లో రాజమండ్రి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.

T.V.SRIKAR