Women Reservation: 3 దశాబ్దాల అడ్డుగోడలు.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏర్పడిన అవాంతరాలివే
దేశంలోని మహిళలకు లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో మోక్షం లభించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. దేశంలోని మహిళలకు లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీన్నిబట్టి ఈ నెల 22 వరకు జరగనున్న స్పెషల్ పార్లమెంట్ సెషన్ లోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభల్లో లైన్ క్లియర్ అవుతుందనే సిగ్నల్స్ వెలువడ్డాయి. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా 1996 సెప్టెంబర్ 12న ప్రధానమంత్రి హెచ్.డీ దేవెగౌడ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ‘81వ రాజ్యాంగ సవరణ బిల్లు’ పేరుతో దాన్ని ఆనాడు పార్లమెంటు ముందుకు తీసుకొచ్చారు. కానీ అది ఆమోదం పొందలేదు. గత 27 ఏళ్లుగా ఈ బిల్లు పార్లమెంటు అటకపై పెండింగ్ లో ఉంది. దేవెగౌడ హయాం ముగిసిన తర్వాతి నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కొన్ని ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి. 1998, 1999, 2008లో పార్లమెంట్‌లోకి ఈ బిల్లు వచ్చినా చట్టంగా మారలేదు. అయితే 1996లో గీతా ముఖర్జీ సారథ్యంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసిన 7 సూచనల్లో ఐదింటిని 2008 నాటి బిల్లులో చేర్చారు. 2010 సంవత్సరంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం కూడా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ.. లోక్‌సభలో మాత్రం ఆటంకం ఎదురైంది. 1996 నుంచి 2010 మధ్యకాలంలో ఈ బిల్లును పార్లమెంటు లో ఎప్పుడెప్పుడు ప్రవేశపెట్టారు..? ఏయే టైంలో ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి ? ఇప్పుడు తెలుసుకుందాం..
1996 సెప్టెంబర్ 12న తొలిసారి..
1996 సెప్టెంబర్ 12న తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీలు, ఎస్టీలకు ఉప రిజర్వేషన్లు కల్పించే నిబంధన ఉంది. కానీ ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే ప్రస్తావన లేదు. ప్రతీ లోక్‌సభ ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ స్థానాలను మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా రిజర్వ్‌డ్ సీట్లను కేటాయించవచ్చని సూచించారు. ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చిన 15 ఏళ్ల తర్వాత మహిళలకు సీట్ల రిజర్వేషన్ ముగుస్తుంది.అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 1998లో ఇదే మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్న కొన్ని పార్టీలు బిల్లును అడ్డుకున్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వం 1999, 2002, 2003-2004లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును అప్రూవ్ చేయడానికి యత్నించింది. కానీ ఆ దిశగా సక్సెస్ కాలేకపోయింది.
2010లో ఎస్పీ, ఆర్జేడీ వ్యతిరేకించాయి..
2004లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. యూపీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును 2008లో 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. 2008లో మహిళా రిజర్వేషన్ బిల్లును ‘స్టాండింగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్’ పరిశీలనకు పంపారు. అయితే ఈ సంఘంలో ఇద్దరు సభ్యులు వీరేంద్ర భాటియా, శైలేంద్ర కుమార్ సమాజ్ వాదీ పార్టీ నాయకులే. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కానప్పటికీ, బిల్లును రూపొందించిన తీరుతో వారు ఏకీభవించలేదు.పార్టీలు అభ్యర్థుల ఎంపికలో 20 శాతం మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలని, మహిళా రిజర్వేషన్ 20 శాతం దాటకూడదని సిఫార్సు చేశారు. 2010 మార్చి 9న రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే యూపీఏ ప్రభుత్వం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టలేదు. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) వ్యతిరేకించాయి. ఈ రెండు పార్టీలు యూపీఏలో భాగం కావడంతో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెడితే తమ ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్ వెనుకడుగు వేసింది.
ఒక్క ఆమోదం.. ఒక్క సంతకమే తరువాయి..
2014లో లోక్‌సభ రద్దయిన తర్వాత 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పేరును కలిగిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆటోమేటిక్‌గా రద్దయింది. కానీ రాజ్యసభ శాశ్వత సభ కావడంతో.. అక్కడ ఈ బిల్లు ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా చేయాలంటే.. దాన్ని మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈక్రమంలోనే మంగళవారంలో లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో గతంలోనే ఈ బిల్లుకు ఆమోదం లభించిన దరిమిలా.. లోక్ సభలో అప్రూవల్ లభించగానే అది రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. ఈ బిల్లు చట్టంగా మారితే 2024 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు లోక్‌సభలో ప్రతి మూడో సభ్యురాలు మహిళే ఉంటారు.