Gold Price: పసిడి ధరలో భారీ తరుగుదల.. కారణం ఏంటి..? భవిష్యత్ ఎలా ఉంటుంది..?
బంగారం కొనాలంటే భయపడే వారికి ఈ అక్టోబర్ మాసం కాస్త ఊరటను కలిగించనుంది. రానున్న వారం 10 రోజుల్లో పసిడి ధర మరింత తగ్గే అవకాశం ఉంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.
పండుగలా పెద్దగా ఏమీ లేవు, పెళ్ళిళ్లా ఈ పక్షం మొత్తం ఖాళీయే, కొనాలన్న ఉత్సాహమా అంతగా కనిపించడంలేదు.. ఇదేదో అల్లూ అర్జున్ సినిమా డైలాగ్ లాగా ఉందనుకుంటే పొరబడినట్లే. ఈ మాట తాజాగా కొనసాగుతున్న బంగారు ధరలకు సరిగ్గా అన్వయం అవుతుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో గడిచిన పది రోజులుగా పసిడి ధరలు పతనమౌతున్నాయి. దీంతో ఇప్పుడే కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ వారంలో కొనుగోలు చేసిన వాళ్లు అయ్యో కొన్ని రోజులు ఆగి ఉంటే మరింత తగ్గేది అని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
10 రోజుల్లో 2500 వరకూ తగ్గుదల..
వినాయక చవితి రెండు రోజుల ముందు నుంచి బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఈ 15 -20 రోజుల్లో ఏకంగా 2500 నుంచి 2700 వరకూ పసిడి ధరలు తగ్గుదల కనిపించింది. ఒకప్పుడు 55,000 పై చిలుకు ఉన్న బంగారు రేటు ఇప్పుడు 52,600 కి పడిపోయింది. రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు మధుపరులు. ఒక వేళ తగ్గితే అర గ్రాము బంగారమైనా అధికంగా కొనుగోలు చేయవచ్చు అని కొందరు అనుకుంటున్నారు. మరొ కొందరైతే తరుగులో వెచ్చించే డబ్బులు ధరలు తగ్గడంలో వెళ్లిపోతాయని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అంటే అక్టోబర్ మూడవ వారం వరకూ ఇలాగే పరిస్తితి కొనసాగవచ్చని ట్రేడ్ వర్గాల నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారం మొత్తంలో మంగళవారం ఒక్కరోజే బంగారు, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు తగ్గుతాయనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణగా చెబుతున్నారు వ్యాపార నిపుణులు. అందుకే అధిక మొత్తంగా కొనాలనుకున్న వారు వారం పది రోజులు వేచి చూడటం మంచిదని సూచిస్తున్నారు.
కారణాలు ఇవే..
- అంతర్జాతీయ మార్కెట్లో బలహీనమైన సంకేతాలు తలెత్తుతున్న నేపథ్యంలో బంగారం ధరకు విలువ క్షీణిస్తోంది.
- అధిక ద్రవ్యోల్బణం ప్రభావం బంగారం పై పడటంతో పసిడి ధరలు దిగొస్తున్నాయి.
- యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలు కూడా ఒక కారణం.
- అమెరికాలో మన్నటి వరకూ ఎదురైన షట్ డౌన్ పరిస్థితులు.
- డాలర్ ధర పెరిగితే ఇక్కడి బాండ్లకు డిమాండ్ పెరిగి బంగారంపై ఆకర్షణ తగ్గుతుంది కనుక ధరలు తగ్గుతున్నాయి.
- చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాల్లో ఆర్థిక వ్యవస్థల్లో కరెన్సీ విలువ పడిపోవడం కూడా ఒక కారణమే.
- ఆయిల్ ధరలు పెరుగుతాయనడంతో వ్యాపారస్థులు బంగారం మీద కాకుండా చమురు పై పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపడం.
- శ్రావణ మాసం పండుగలు, పెళ్లిళ్ల సీజన్ అయిపోయింది. రానున్నది అంతా పక్షమాసమే. ఈ రోజుల్లో బంగారం కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపరు.
- కొనేందుకు ముందుకు రాకపోవడంతో డిమాండ్ తగ్గింది దీని ప్రభావం ధరల పై పడుతోంది.
- దసరా నాటకి క్రమక్రమంగా పుంజుకునే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు.
మన దేశంలోని ప్రధాన నగరాల్లో తులం పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో పసిడి ధర రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.57,530 గా ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.57,380 కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600 గా కొనసాగుతోంది.
- కోల్‌కతాలో 24 క్యారెట్ల ధర రూ.57,380, 22 క్యారెట్లు రూ.56,600కు దిగి వచ్చింది.
- చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.57,710 కాగా 22 క్యారెట్ల ధర రూ.52,900గా ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.57,380 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,600 వద్ద స్థిరంగా ఉంది
- కేరళలో 24 క్యారెట్లు రూ.57,380 కాగా 22 క్యారెట్ల ధర రూ.56,600 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ.57,380 ఉంటే 22 క్యారెట్లు బంగారం ధర రూ.52,600 గా ఉంది.
- విజయవాడలోనూ 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380 గానూ 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,600 ఉంది.
T.V.SRIKAR