చైనాలో కరోనా లాంటి మరో వైరస్ వ్యాపిస్తోందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. కొన్నేళ్ల ముందు చైనా నుంచి వ్యాప్తి ప్రారంభమైన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ రేంజ్‌లో కుదిపేసిందో అంతా చూశారు. దీంతో ఇప్పుడు మరోసారి అదే దేశం నుంచి మరో వైరస్ వ్యాప్తి ప్రారంభమవ్వడం తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. 2001లోనే గుర్తించిన హ్యూమన్ మెటానిమోవైరస్.. ప్రస్తుతం డ్రాగన్ దేశంలో వెలుగు చూస్తోన్న కేసులకు ఓ కారణం. చైనా ఉత్తర ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆసియా దేశాలు కూడా దీనిపై దృష్టిసారించాయి. HMPV వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారిన పడే అవకాశాలు ఎక్కువ. దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లు, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన తర్వాత నోరు, ముక్కు, కళ్లను తాకితే ఈ వైరస్ వ్యాపిస్తోంది. కరోనా నుంచి నేర్చుకున్న పాఠాలతో చిన్నపాటి ముందుజాగ్రత్త చర్యలతో ఈ వైరస్ దరిచేరకుండా చూసుకోవచ్చంటున్నారు డాక్టర్లు. సబ్బుతో 20 సెకండ్ల పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని చేతులతో ముఖాన్ని తాకకుండా చూసుకోవాలి. వైరస్ బారినపడిన వ్యక్తులకు దూరం పాటించాలి. తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. వైరస్ బారినపడినవారు దగ్గు, తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆ వ్యక్తులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూసుకోవాలి. వైరస్ లక్షణాలు కనిపించినప్పుడు నలుగురులోకి వెళ్లడం కంటే ఇంట్లోనే ఉంటే మంచిదని చెప్తున్నారు డాక్టర్లు. గతంలో ఇలాంటి జాగ్రత్తలు లేకపోవడం కారణంగానే కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపించింది. ఏకంగా లాక్‌డౌన్ వెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా చేసుకునే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉందంటున్నారు డాక్టర్లు.[embed]https://www.youtube.com/watch?v=tnUi4Fh2vSE[/embed]