ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ బంగారం, వెండి కొనేవారికి ఊరట కలిగించింది. ఈ రెండింటిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి తగ్గించడంతో గోల్డ్ రేట్లు తగ్గే అవకాశముంది. అలాగే మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపైనా 15శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింది. దాంతో మొబైల్ రేట్లు కూడా డౌన్ అవుతాయని అంటున్నారు. పేద, మధ్య తరగతి జనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కేంద్ర బడ్జెట్ లో వరాలు ప్రకటించారు . 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. విద్యార్థుల చదువులకు లోన్లతో పాటు పేదలకు పీఎం ఆవాస్ యోజన ఇళ్ళు, ముద్ర లోన్లు పెంపు లాంటి అంశాలు పూర్, మిడిల్ క్లాస్ వారికి ఊరట కలిగించేవి. మొబైల్ ఫోన్లు, బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో అవి కూడా రేట్లు తగ్గే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ళను అదనంగా నిర్మిస్తామని బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అర్బన్ హౌసింగ్ కోసం వచ్చే ఐదేళ్లలో 2 లక్షల 20 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం రెంటెడ్ హౌసెస్ కట్టిస్తామని తెలిపారు. యువత సొంతంగా షాపులు పెట్టుకోడానికి... ఇతరత్రా ఉపాధి కార్యక్రమాలకు ఇచ్చే ముద్రా లోన్స్ పరిమితిని పెంచారు. గతంలో 10 లక్షలు ఉంటే... ఇప్పుడు దాన్ని 20 లక్షల రూపాయలు చేశారు. ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా కోటి మంది రైతుల్ని తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అలాగే 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి లక్షన్నర కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ లో యూత్ కి బాగా ప్రియారిటీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్ మెంట్ కింద శిక్షణ ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వం. అలాగే వచ్చే ఐదేళ్ళలో కోటి మందికి 500 పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తారు. అందుకోసం ప్రతినెలా 5 వేలు స్టయిఫండ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే విద్యార్థులకు 10 లక్షల రూపాయల దాకా విద్యా రుణాలను ప్రభుత్వం అందించబోతోంది. మహిళలు, బాలికల కోసం 3 లక్షల కోట్లతో పథకాలను నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి బంపరాఫర్ ఇచ్చింది ప్రభుత్వం. మొదటి నెల జీతంలో 15 వేల దాకా ఆ ఉద్యోగి PF ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ చేయనుంది. ఈ స్కీమ్ తో 2 కోట్ల మందికి పైగా యువతకు బెనిఫిట్ ఉంటుందన్నారు నిర్మలా సీతారామన్. యువత నైపుణ్యాలను పెంచే బడ్జెట్ ను ఇచ్చామన్నారు ప్రధాని నరేంద్రమోడీ. అన్ని వర్గాల అభివృద్ధి కోసం దీన్ని రూపొందించినట్టు చెప్పారు.