ఇదో పనికిమాలిన పిచ్, క్యూరేటర్ పై దినేశ్ కార్తీక్ ఫైర్
ఐపీఎల్ 2025 సీజన్ లో ఆతిథ్య పిచ్ లపై వివాదం మరింత ముదురుతోంది. ఫ్రాంచైజీలు, పిచ్ క్యూరేటర్ల మధ్య సరైన సమన్వయం లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఐపీఎల్ 2025 సీజన్ లో ఆతిథ్య పిచ్ లపై వివాదం మరింత ముదురుతోంది. ఫ్రాంచైజీలు, పిచ్ క్యూరేటర్ల మధ్య సరైన సమన్వయం లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కోల్ కత్తా పిచ్ పై కేకేఆర్ కెప్టెన్ రహానే, ఉప్పల్ పిచ్ పై సన్ రైజర్స్ సారథి కమ్మిన్స్ విమర్శలు గుప్పించారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెంటార్ కమ్ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్ కూడా చిన్నస్వామి స్టేడియం పిచ్ క్యూరేటర్ ను తిట్టిపోశాడు. తాము కోరిన పిచ్‌ను బెంగళూరు క్యూరెటర్ సిద్దం చేయలేదని తెలిపాడు. అతను తయారు చేసిన చెత్త పిచ్‌ల కారణంగానే బెంగళూరు వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు
స్లో పిచ్‌ల కారణంగా తమ జట్టు ఓడిపోయిందన్నాడు. కేఎల్ రాహుల్‌ను ఔట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. టీ20 క్రికెట్‌లో పరుగుల వరద పారితేనే అటు బ్రాడ్ కాస్టర్స్.. ఇటు అభిమానులు మ్యాచ్ ను ఆస్వాదిస్తారన్నాడు. ప్రేక్షకులు బౌండరీలనే ఎక్కువగా ఇష్టపడుతారనీ, తమ రెండు హోమ్ మ్యాచ్‌లకు మంచి వికెట్ తయారు చేయాలని క్యూరెటర్‌ను కోరినా ఇవ్వలేదంటూ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే పిచ్‌లు రెడీ చేయమంటే స్లో వికెట్ తయారు చేశాడంటూ మండిపడ్డాడు. ఈ రెండు పిచ్‌లు బ్యాటింగ్‌కు సవాల్‌గా మారాయన్న దినేశ్ కార్తీక్ తమ బ్యాటర్లు క్రీజులో ఉండి పోరాడే ప్రయత్నం చేశారన్నాడు. అయితేస్ట్రైక్ రొటేట్ చేయడం.. షాట్స్ ఆడటం కష్టమైందని చెప్పుకొచ్చాడు. పిచ్‌కు తగ్గట్లు దూకుడును నియంత్రించుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదన్నాడు. తాము క్యూరెటర్‌తో చర్చించే ప్రయత్నం చేస్తామనీ, మళ్ళీ గెలుపు బాట పడతామని డీకే వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో బయటి వేదికలపై దుమ్ము రేపుతున్నఆర్‌సీబీ.. సొంతగడ్డపై మాత్రం తేలిపోతుంది. రెండు వరుస విజయాల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ.. గత మ్యాచ్‌లో వాంఖడే వేదికగా ముంబైపై సంచలన విజయాన్నందుకుంది. కానీ మళ్లీ సొంత మైదానంలో తేలిపోయింది. బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని చిత్తు చేసింది.
మరోవైపు ఇప్పటికే కోల్ కత్తా కెప్టెన్ అజింక్యా రహానే, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌లు.. పిచ్ క్యూరెటర్లపై విమర్శలు గుప్పించారు. పిచ్ క్యూరెటర్లు తమకు హోమ్ అడ్వాంటేజ్ లేకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈడెన్ పిచ్‌పై క్యూరేటర్ సుజన్ ముఖర్జీ, కేకేఆర్ యాజమాన్యం మధ్య వివాదం ముదురినట్లు తెలుస్తుంది. లక్నో చేతిలో ఓటమి అనంతరం ఓ కేకేఆర్ అధికారి ఈడెన్ పిచ్ క్యూరేటర్‌ను ఉద్దేశిస్తూ.. అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సిందని వ్యంగ్యంగా అన్నట్లు సమాచారం. లక్నోతో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారధి రహానే కూడా క్యూరేటర్ సుజన్ ముఖర్జీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే వివాదం పెద్దమవడం ఇష్టం లేక వదిలిపెట్టినట్లున్నాడు. సుజన్ ఇదివరకే మీడియా ప్రచారం పొందాడంటూ రహానే సెటైర్లు వేశాడు. అయితే ఆడడం చేతకాక ఇలా పిచ్ క్యూరేటర్లను నిందించడం సరికాదంటూ కొందరు ఐపీఎల్ టీమ్స్ కు కౌంటర్ ఇస్తున్నారు. కానీ ఓవరాల్ గా ఈ సీజన్ లో కొన్ని జట్లకు హోం అడ్వాంటేజ్ లేకుండా పోయిందన్నది అంగీకరించాల్సిందే.