సింధుకు కాబోయే భర్త ఇతడే, అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అతి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయిని ఆమె వివాహం చేసుకోనుంది. ఈ నెల 22న సింధు- దత్తసాయి ఒక్కటికానున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వైభవంగా వివాహం జరగనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2024 | 03:45 PMLast Updated on: Dec 03, 2024 | 3:45 PM

This Is Sindhus Future Husband This Is His Background

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అతి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయిని ఆమె వివాహం చేసుకోనుంది. ఈ నెల 22న సింధు- దత్తసాయి ఒక్కటికానున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వైభవంగా వివాహం జరగనుంది. అనంతరం హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ ఇవ్వనున్నట్టు సింధు తండ్రి రమణ చెప్పారు. భారత బ్యాడ్మింటన్ లో ఎన్నో చారిత్రక విజయాలతో సత్తా చాటిన సింధుకు కాబోయే వరుడి గురించి ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
వెంకటదత్త సాయిది హైదరాబాదే… లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో డిప్లొమో చేసిన సాయి తన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పట్టా అందుకున్నాడు. డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్ లో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశాడు.

వెంకట దత్త సాయి ఐపీఎల్ టీమ్స్ కు పనిచేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓనర్లలో ఒకటైన JSW సంస్థకు సాయి ఇన్ హౌస్ కన్సల్టెంట్ గా వ్యవహరించాడు. ఫైనాన్స్ సెక్టార్ లో బీబీఏ చేయడంతో ఐపీఎల్ టీమ్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసే అవకాశం వచ్చిందని సాయి తన లింక్ డిన్ ప్రొఫైల్ లో రాసుకొచ్చాడు. 2019 నుంతి సోర్ యాపిల్ మేనేజ్ మెంట్ కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్న సాయి పోసీడెక్స్ కూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. కాగా సింధు పెళ్ళి తర్వాత కూడా బ్యాడ్మింటన్ కెరీర్ కొనసాగించనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడనుందని, అందుకే డిసెంబర్‌లో పెళ్లి ముహుర్తం పెట్టుకున్నామని ఆమె తండ్రి పీవీ రమణ చెప్పారు.

సింధు దాదాపు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్ గెలుచుకుంది. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. గత పదేళ్ళుగా బ్యాడ్మింటన్ లో తనదైన ముద్ర వేసిన పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు నెగ్గింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. 2017, 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రజతం, 2013, 2014‌లలో కాంస్య పతకాలు నెగ్గింది. ఓవరాల్‌గా అయిదు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో అయిదు పతకాలు గెలిచింది. 2024 ఒలింపిక్స్ లో మెడల్ సాధించడంలో నిరాశపరిచిన సింధు వచ్చే సీజన్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.