“ఇది రతన్ టాటా బ్రాండు”… రతన్ టాటా బ్యాక్ గ్రౌండ్ ఇదే
“శక్తివంతమైన నిర్ణయాలు నమ్మను, నిర్ణయాలను శక్తివంతంగా మారుస్తాను” ఇది రతన్ నావెల్ టాటా స్టైల్. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దాన్ని కరెక్ట్ చేయగలిగే దమ్ము ఉంటే తీసుకోవాలని భావితరాలకు తన చేతలతో చెప్పిన ధీరుడు రతన్ టాటా.
“శక్తివంతమైన నిర్ణయాలు నమ్మను, నిర్ణయాలను శక్తివంతంగా మారుస్తాను” ఇది రతన్ నావెల్ టాటా స్టైల్. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దాన్ని కరెక్ట్ చేయగలిగే దమ్ము ఉంటే తీసుకోవాలని భావితరాలకు తన చేతలతో చెప్పిన ధీరుడు రతన్ టాటా. టాటా అంటే ఓ మారుమూల పట్టణంలో ఉండే కంపెనీ కాదు… వరల్డ్ మ్యాప్ లో ఓ ల్యాండ్ మార్క్ అవ్వాలని పట్టుదలగా గురిపెట్టి కొట్టిన దిగ్గజ పారిశ్రామిక వేత్త. భారత్ ను చిన్న చూపు చూసే దేశాలకు భారత్ అంటే ఓ భవిష్యత్తు గమ్యంగా మార్చడంలో సింహాస్వప్నం రతన్ టాటా.
ప్రపంచంలో ఉన్న బిలియనీర్లలో వ్యతిరేకత లేని ఒకే ఒక్కడు రతన్ టాటా. కూరల్లో వాడే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు టాటా బ్రాండ్ విస్తరించడంలో రతన్ టాటా కృషి ఎంతో ఉంది. టాటాను భారత ప్రజల్లో జీవితాల్లో ఇమిడిపోయేలా చేసిన రతన్ టాటా… టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు ముని మనవడు. సూని టాటా, నావల్ టాటా దంపతులకు రతన్ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు. డైమండ్ స్పూన్ తో పుట్టిన రతన్ టాటా సంపదను ఎంజాయ్ చేయడం కంటే… కష్టపడటమే లైఫ్ గోల్ గా పెట్టుకున్నారు.
తల్లి తండ్రులు రతన్ టాటా పదేళ్ళ వయసులోనే విడిపోవడంతో తన నాయనమ్మ నవాజ్ బాయ్ టాటా వద్దనే పెరిగారు. ముంబై, సిమ్లాల్లో కొన్నాళ్ళు చదివిన టాటా… ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే రివర్‌డేల్ కంట్రీ హైస్కూల్ లో స్కూలింగ్ లో పట్టా అందుకుని అనంతరం కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసారు. అదే రంగంలో కొన్నాళ్ళ పాటు ఉద్యోగం కూడా చేసారు రతన్ టాటా. 1959లో డిగ్రీ పట్టా అందుకున్నారు రతన్ టాటా. ఆ తర్వాత నానమ్మకు ఆరోగ్యం బాగా లేకపోతే ఇండియా వచ్చేశారు.
1961లో ఆయన టాటా గ్రూపులో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయిన రతన్ టాటా… 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డైరెక్టర్ ఇన్‌చార్జిగా.. 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ గా రతన్ ఒక్కో మెట్టు ఎక్కారు. టాటా కంపెనీలో కీలక స్థానంలో ఉన్నా ఆయన చదువుకు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. 1975లో అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి… 1991లో జేఆర్‌డీ టాటా వారసుడిగా టాటా సన్స్ చైర్మన్ బాధ్యతలను సగర్వంగా అందుకున్నారు. 2012 డిసెంబరు 28వ తేదీ ఆయన రిటైర్ అయ్యారు.
ఈ 20 ఏళ్ళ కాలంలో టాటా రేంజ్ ను ఆయన ప్రపంచానికి విస్తరించారు. దేశీయ కంపెనీలు అంటే సైకిళ్ళు మాత్రమే కాదు కార్లు కూడా తయారు చేస్తాయని ప్రూవ్ చేసారు. టాటా సంస్థలో విభేదాలు రాగా 2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి వరకు తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 1991లో టాటా సన్స్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టే నాటికి టాటా గ్రూప్ కంపెనీలు 250 కాగా ఆ సంఖ్యను భారీగా తగ్గించి 98 చేసి… సంస్థను కొత్త మార్గంలో నడిపారు. రతన్ టాటా హయాంలోనే టాటా గ్రూపు.. హై టెక్నాలజీ వ్యాపారాల్లో ప్రవేశించింది.
10 వేల కోట్ల ఇండియన్ కరెన్సీ నుంచి 10 వేల కోట్ల అమెరికన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా టాటా అవతరించడంలో రతన్ టాటాది కీలక పాత్ర. ముఖ్యంగా… టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలీ సర్వీసెస్ ప్రపంచపఠంలో ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచాయి. టీసీఎస్ ను దేశంలో వెయ్యికోట్ల డాలర్ల వార్షిక ఆదాయం సాధించిన కంపెనీగా తీర్చిదిద్ది… వెయ్యి కోట్ల డాలర్ల ఆదాయం అందుకున్న తొలి దేశీయ కంపెనీగా నిలిపారు. అలాగే సేవా కార్యక్రమాల్లో రతన్ టాటాది పెద్ద చేయి.
తన ఆదాయంలో 60 నుంచి 65 శాతం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తూ ఉంటారు. కరోనా సమయంలో ఏకంగా 1500 కోట్లు సాయం చేసి చరిత్ర సృష్టించారు. ఇంతటి ఘనతలు సాధించిన రతన్ టాటాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ తో, 2008లో పద్మవిభూషణ్ తో గౌరవించింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్ టాటా అందుకోవడం విశేషం. తాను చదువుకున్న కార్నెల్ యూనివర్సిటీకి 2008లో 50 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చి… ఆ యూనివర్సిటీ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా చరిత్ర సృష్టించారు.