Chiranjeevi, Padma Vibhushan : మెగాస్టార్‌కి పద్మవిభూషణ్ రావడం వెనుక అసలు కారణం ఇదే..!
తెలుగు తేజం విజయకేతనం ఎగురవేసింది. ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ (Padma Vibhushan) అవార్డును సొంతం చేసుకొని తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. మెగాస్టార్ (MegaStar) చిరంజీవి (Chiranjeevi) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
తెలుగు తేజం విజయకేతనం ఎగురవేసింది. ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ (Padma Vibhushan) అవార్డును సొంతం చేసుకొని తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. మెగాస్టార్ (MegaStar) చిరంజీవి (Chiranjeevi) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో అత్యంత ఉన్నత పురస్కారంగా చెప్పబడే పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించిన మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో అత్యున్నత పురస్కారం కూడా చేరింది.
తన సినిమాల ద్వారా వినోదాన్ని పంచడమే కాదు, సమాజాన్ని చైతన్యపూరితుల్ని చేసే ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి. ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి.. కేవలం స్వయంకృషితోనే ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం. కేవలం సినిమాలతో వినోదాన్ని పంచడమే కాదు, తన సేవా దృక్పథంతో ఎంతో మందికి అండగా నిలిచారు, ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు ఆనందాన్ని పంచారు.
మదర్ థెరిస్సా స్ఫూర్తితో 1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసిన చిరంజీవి రక్తదానం, నేత్రదానం దిశగా అభిమానుల్ని నడిపించారు. కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించిపోవడంతో కార్మికుల్ని ఆదుకోవడం కోసం సీసీసీ సంస్థని ఏర్పాటు చేసి విరాళాల్ని సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. 2012 నుంచి ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2012- 2014 వరకూ మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలు అందించారు. మెగాస్టార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్‌ను ప్రకటించి తగిన రీతిలో సత్కరిస్తోంది.
దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం (Civil Award) పద్మ విభూషణ్ లభించినందుకు చిరంజీవి సంతోషంగా వ్యక్తం చేశారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబ సభ్యుల అండదండలు, నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగా తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని ఎమోషనల్ అయ్యారు. తనకు దక్కిన ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలన్న చిరు ఈ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీగారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు.
తన నటనతో 45 ఏళ్ళుగా ఎంటర్‌టైన్ చేస్తున్న చిరంజీవి ప్రతి తెలుగువారి సొంత మనిషిగా భావిస్తారు. కేవలం సినిమాలతోనే కాదు, పలు సేవా కార్యక్రమాటు చేపట్టి ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. చిరంజీవి అంటే ఇంతటి ప్రభంజనం ఏ ఒక్కరోజుతోనో రాలేదు. అంతటి కీర్తి ప్రతిష్టల వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి. వినోదాన్ని అందించడమే కాదు, ఆపదలో ఉన్నవారికి తన సాయం కూడా అందాలన్న సంకల్పం ఆయన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. మెగాస్టార్‌ని ఈ అత్యున్నత పురస్కారం వరించడం వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తించిన కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్‌కి మెగాస్టార్ చిరంజీవి నూటికి నూరుశాతం అర్హుడని భావించింది.