DK Aruna: గద్వాలలో పోటీకి డీకే అరుణ విముఖత..కారణం ఏంటో తెలుసా..?
బీజేపీ పార్టీ అభ్యర్థిగా డీకే అరుణ ఉండదని తెలియడంతో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా కలతచెందుతున్నారు.
బీజేపీ పార్టీ అభ్యర్థిగా డీకే అరుణ ఉండదని తెలియడంతో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా కలతచెందుతున్నారు. గతంలో అర్ధాంతరంగా బీజేపీ పార్టీలోకీ పోవడంతో ఆమె వెంట ఉన్న చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. కొంతమంది ఆమె వెంటే ఉన్నారు, నేడు మరోసారి పోటిలో ఉండదని తెలిసి కొందరు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లుతున్నారు.
రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సాధించుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గద్వాల నియోజకవర్గం నుండి పోటీలో ఉంటుందని విస్తృత ప్రచారం జరిగిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీసుకున్న అనూహ్య నిర్ణయం పార్టీ శ్రేణులను..రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గద్వాల నియోజకవర్గంలో ఆది నుండి ఒక్కసారి మినహాయిస్తే డీకే కుటుంబ పాలన కొనసాగుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరుణ మంత్రిగా రాణించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న విభేదాల కారణంగా 2019లో పార్టీ మారి బీజేపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికి ఉన్న కొద్ది సమయంలోనే తన సత్తా చాటిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆమెకు జాతీయస్థాయిలో ఉపాధ్యక్షురాలు పదవిని అప్పగించింది.
రాష్ట్రంలో అధికార పార్టీ అక్రమాలు, అవినీతిపై ఘాటుగా స్పందిస్తూ.. తన ఉనికిని చాటుకుంది. గద్వాలలో డీకే అరుణ కు సమీప బంధువు అయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం సెట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరోసారి పోటికి సిద్ధంగా ఉన్నారు. ఇరువురి మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకు పెరగడం, నియోజకవర్గంలో బీసీ వాదం పెరిగిపోతుండడంతో డీకే అరుణ అనూహ్య నిర్ణయం తీసుకొని తాను పోటీలో ఉండడం లేదు అని, బీసీలను ప్రోత్సహించేందుకు బలమైన బీసీ నేతలను పోటీలో దించుతానని ప్రకటించి సంచలనం రేపింది.
బీజేపీ మొదటి జాబితాలోని ఆమె పేరు వస్తుందని అందరూ ఊహించారు. ఆమె పోటీకి విముఖతో చూపడం వల్లే జాబితాలో పేరు రాలేదని తెలుస్తోంది. మొత్తంపై డీకే అరుణ తీసుకున్న నిర్ణయం పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. పోటీలో ఉండాలని పాలువురు నాయకులు కార్యకర్తలు సూచించిన ఆమె ససేమిరా అంగీకరించలేదని తెలిసింది. కాగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం తగ్గడం, గద్వాలలో బీసీ వాదం బలపడడం వల్లనే ఆమె పోటీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు కొంతమంది అంటున్నారు. కాగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీలో ఉండే ఉద్దేశంతోనే డీకే అరుణ ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొంతమంది భావిస్తున్నారు.