దుబాయ్ లో భారత్ మ్యాచ్ లు, ట్విస్ట్ అదే…!
క్రికెట్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది. చాలా నెలల తర్జన భర్జన తర్వాత ఎట్టకేలకు ఐసీసీ షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది.
క్రికెట్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది. చాలా నెలల తర్జన భర్జన తర్వాత ఎట్టకేలకు ఐసీసీ షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది. ఊహించినట్టుగానే ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరగనుంది. ఆతిథ్య హక్కులు పాక్ వే అయినప్పటకీ అక్కడికి వెళ్ళేందుకు భారత్ నిరాకరించింది. పాక్ క్రికెట్ బోర్డు ఎంత ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒక దశలో టోర్నీ నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధమైంది. కానీ టీమిండియా లాంటి పెద్ద జట్టు మెగాటోర్నీలో ఆడకుంటే వచ్చే నష్టమేంటనేది ఐసీసీకి బాగా తెలుసు.. అందుకే పాక్ క్రికెట్ బోర్డుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి హైబ్రిడ్ మోడల్ కు ఓకే చేయించింది. కాకుంటే పాక్ బోర్డు కూడా భారత్ లో జరిగే ఐసీసీ టోర్నీలకు హైబ్రిడ్ మోడల్ ను అమలు చేసేలా వెసులుబాటు పొందింది.
ఐసీసీ అధికారికంగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్,… గ్రూప్‍బీలో అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చోటు దక్కించుకున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్తాన్ ఫిబ్రవరి 19న న్యూజిలాండ్ తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ లో లాహోర్ , కరాచీ, రావల్పిండి ఆతిథ్యమిస్తున్నాయి. ఇప్పటికే అక్కడి స్టేడియాలను ఆధునీకరించే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగబోతున్నాయి. ఈ మెగా టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో ఆడుతుంది. ఇక క్రికెట్ ప్రపంచం వేచిచూస్తున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ సమరం ఫిబ్రవరి 23న దుబాయ్ లోనే జరగబోతోంది. అటు గ్రూప్ స్టేజ్ లో చి భారత్ తన చివరి మ్యాచ్ లో మార్చి 2న న్యూజిలాండ్ తో తలపడుతుంది.
అయితే మెగా టోర్నీలో భారత్ గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమిస్తే ఫైనల్ లాహోర్ లో జరుగుతుంది. ఒకవేళ టీమిండియా సెమీస్ కు చేరితే దుబాయ్ లోనే మిగిలిన మ్యాచ్ లు ఉంటాయి. దీని కోసమే మార్చి 10న దుబాయ్ లో రిజర్వ్ డేను కూడా కేటాయించారు.