ముగ్గురు పేసర్లా..ముగ్గురు స్పిన్నర్లా ? భారత్ తుది జట్టుపై సస్పెన్స్
భారత్, న్యూజిలాండ్ తొలి టెస్ట్ బుధవారం నుంచే మొదలుకానుంది. సొంతగడ్డపై ఇటీవల బంగ్లాదేశ్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మరోసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకూ భారత్ లో ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవని న్యూజిలాండ్ మెన్ ఇన్ బ్లూను ఓడించాలని పట్టుదలగా ఉంది.
భారత్, న్యూజిలాండ్ తొలి టెస్ట్ బుధవారం నుంచే మొదలుకానుంది. సొంతగడ్డపై ఇటీవల బంగ్లాదేశ్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మరోసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకూ భారత్ లో ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవని న్యూజిలాండ్ మెన్ ఇన్ బ్లూను ఓడించాలని పట్టుదలగా ఉంది. అది అంత ఈజీ కాదన్నది మాత్రం కివీస్ కు తెలుసు. గత కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్ లో టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉంది. ఇంటా, బయటా కూడా నిలకడగా రాణిస్తూ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే కివీస్ పై సిరీస్ విజయం భారత్ కు కీలకం. ఈ నేపథ్యంలో బంగ్లాపై ఆడిన పటిష్ట జట్టుతోనే బరిలోకి దిగుతోంది.
భారత్ లో న్యూజిలాండ్ పేలవ రికార్డే ఉన్నప్పటకీ తేలికగా తీసుకోకూడదని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. అందుకే తుదిజట్టు కూర్పు విషయంలో రాజీ పడే పరిస్థితి లేదు. స్వదేశీ పిచ్ లు కావడంతో మరోసారి స్పిన్ మంత్రంతోనే కివీస్ ను దెబ్బకొట్టేందుకు రెడీ అవుతోంది. శ్రీలంక పర్యటనలో స్పిన్నర్ల ముందు కివీస్ బ్యాటర్ల నిలవలేకపోయారు. ఈ క్రమంలో ముగ్గరు స్పిన్నర్లతో జట్టులోకి దిగే ఛాన్సుంది.
అదే జరిగితే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతో పాటు కుల్‌దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడు. అదే సమయంలో ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండడంతో ముగ్గురు పేసర్ల కాంబినేషన్ నూ కొట్టిపారేయలేం. ముగ్గురు పేసర్లతో ఆడాల్సి వస్తే మాత్రం కుల్దీప్ బెంచ్ కే పరిమితమవుతాడు. కాగా బ్యాటింగ్ విభాగంలో మాత్రం మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
ఇటీవల ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్‌కు నిరాశే మిగలనుంది. అతనికి ఈసారి కూడా తుదిజట్టులో స్థానం దక్కే అవకాశం కనిపించట్లేదు. కేఎల్ రాహుల్‌ను కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించడంతో సర్ఫరాజ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అలాగే రిషభ్ పంత్ ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగడంతో ధ్రువ్ జురెల్ కూడా తుదిజట్టులో చోటు దక్కే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఆసీస్ తో సిరీస్ కు ముందు వీరిద్దరూ సత్తా చాటితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మనకు తిరుగుండదనే చెప్పాలి. ఇక రికార్డుల పరంగా చూస్తే మాత్రం భారత్ దే పైచేయిగా ఉంది. స్వదేశంలో కివీస్ తో 36 మ్యాచ్ లు ఆడిన టీమిండియా 17 టెస్టులు గెలిచి..రెండింటిలో ఓడిపోయింది. మరో 17 టెస్టులు డ్రాగా ముగిసాయి.