Secunderabad : గ్రేటర్ లో త్రిముఖ పోరు.. సికింద్రాబాద్ సికిందర్ ఎవరు..?

సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో... 2019లో గెలిచిన కిషన్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ ఫస్ట్ లిస్టులోనే టిక్కెట్ రావడంతో... నియోజకవర్గంలో అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించారు. నిత్యం ఓటర్లతో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. 2019లో ఈ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే గెలవకున్నా... మోడీ ఇమేజ్ తో కిషన్ రెడ్డి గెలిచారు. ఈసారి కూడా మోడీ గ్యారంటీలతో మళ్ళీ విసయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 7, 2024 | 03:03 PMLast Updated on: May 07, 2024 | 3:03 PM

Three Way Battle In Greater Who Is Sikandar Of Secunderabad

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం… బరిలో హేమా హేమీలు… గెలుపుపై ఎవరి ధీమా వారిదే. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్. గెలుపుపై ఎవరి ధీమాలు వారివే. మోడీ గ్యారంటీలే ప్రచారాస్త్రాలుగా కిషన్ రెడ్డి… రాష్ట్రంలో అధికారం ఉంది… గెలుస్తామని దానం, గ్రేటర్ లో ఎమ్మెల్యే బలం కలిసొస్తుందని పద్మారావు… సికింద్రాబాద్ లో గెలుపు ఆశలు పెట్టుకున్నారు. ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ, సిక్కు మతస్థులు కలసి ఉన్న ఓటర్లు… మినీ ఇండియా సికింద్రాబాద్ లో ఎవర్ని గెలిపిస్తారు… ఎవర్ని పార్లమెంట్ కు పంపుతారు… ముగ్గురు లీడర్ల మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతోంది ?

సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీళ్ళల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన కిషన్ రెడ్డి, దానం నాగేందర్, పద్మారావు గౌడ్ మధ్యే పోటీ తీవ్రంగా ఉండబోతోంది. ఈపార్లమెంట్ స్థానంలో ఓటర్లపై రాష్ట్ర రాజకీయాల కన్నా… జాతీయ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులే గెలుస్తున్నారు.

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో 21 లక్షల 20 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో అంబర్ పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి… ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గం 1957లో ఏర్పడగా… అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఐదు సార్లు బీజేపీ నెగ్గింది. 1971లో మాత్రమే తెలంగాణ ప్రజాసమితి గెలిచింది. సికింద్రాబాద్ లో గెలిచిన పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ కూడా ఉంది.

సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో… 2019లో గెలిచిన కిషన్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బీజేపీ ఫస్ట్ లిస్టులోనే టిక్కెట్ రావడంతో… నియోజకవర్గంలో అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించారు. నిత్యం ఓటర్లతో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. 2019లో ఈ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే గెలవకున్నా… మోడీ ఇమేజ్ తో కిషన్ రెడ్డి గెలిచారు. ఈసారి కూడా మోడీ గ్యారంటీలతో మళ్ళీ విసయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు.

కేంద్రంలో NDA అధికారంలోకి వస్తే… మళ్ళీ మంత్రిపదవి వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిటింగ్ ఎంపీగా కొంత వ్యతిరేకత ఉన్నా… మోడీ మేనియాతో గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది… ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే సికింద్రాబాద్ లో బలమైన అభ్యర్థి దానం నాగేందర్ ను రంగంలోకి దింపారు.

గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో… గ్రేటర్ హైదరాబాద్ లో పలుకుబడి ఉన్న దానం అందర్నీ కలుపుకుపోతూ ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీలను నియమించారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ తో ప్రచారం చేస్తున్నారు. సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా ఉంది. అయితే గ్యారంటీలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఉన్న ఆదరణతో ఈసారి సికింద్రాబాద్ ని దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతున్నారు.

సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని బీఆర్ఎస్ గెలిచింది. గ్రేటర్ లో ఆ పార్టీకి మంచి పట్టుంది. అందుకే తమ గెలుపుపై నమ్మకం పెట్టుకుంది బీఆర్ఎస్. పద్మారావు గౌడ్ తెలంగాణ ఉద్యమకారుడు, పార్టీలో సీనియర్ నేత, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. పదేళ్ళుగా ఎమ్మెల్యేగా BRS ప్రభుత్వం చేసిన అభివృద్ధి… మంత్రిగా, ఎమ్మెల్యేగా తను పనులు గెలిపిస్తాయని చెబుతున్నారు పద్మారావు గౌడ్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరుచుగా కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలతో పద్మారావు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో కొందరు పూర్తి స్థాయిలో సహకారం అందించడం లేదన్న ఆరోపణలున్నాయి.

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని….ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మైనార్టీ ఓట్టే కీలకం. నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో వర్షాకాలంలో కాలనీలు నీట మునుగుతున్నాయి. కొన్నేళ్ళుగా నాలాలను పునరుద్దరణ పనులు జరక్కపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నల్ రోడ్స్ దారుణంగా ఉన్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఆక్రమణలు తొలగించి… రోడ్ల విస్తరణ చేపట్టాలనీ… ఫ్లైఓవర్లు నిర్మించాలని జనం కోరుతున్నారు.