తిలక్ వర్మ సరికొత్త చరిత్ర టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీ

భారత టీ ట్వంటీ క్రికెటర్ తిలక్ వర్మ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ లో వరుసగా రెండు శతకాలు బాదిన తిలక్ తాజాగా దేశవాళీ క్రికెట్ లోనూ దుమ్మురేపుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన తిలక్ వర్మ మేఘాలయపై సెంచరీ బాదేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 23, 2024 | 03:55 PMLast Updated on: Nov 23, 2024 | 3:55 PM

Tilak Verma Creates History With Hat Trick Century In T20is

భారత టీ ట్వంటీ క్రికెటర్ తిలక్ వర్మ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్ లో వరుసగా రెండు శతకాలు బాదిన తిలక్ తాజాగా దేశవాళీ క్రికెట్ లోనూ దుమ్మురేపుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన తిలక్ వర్మ మేఘాలయపై సెంచరీ బాదేశాడు. దీంతో టీ ట్వంటీ క్రికెట్ లో వరుసగా మూడు శతకాలు బాదిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. మేఘాలయతో మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ కేవలం 67 బంతుల్లోనే 151 పరుగులు చేశాడు. అతన్ని ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. టీ ట్వంటీ క్రికెట్ లో 150 ప్లస్ స్కోర్ చేసిన తొలి భారత క్రికెటర్ గానూ రికార్డు సృష్టించాడు.

దక్షిణాఫ్రికా మూడు, నాలుగో టీ20ల్లో వన్‌డౌన్‌లో వచ్చిన అతను అజేయంగా 107, 120 పరుగులు బాదాడు. కాగా, మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లోనూ తిలక్ మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. కాగా, గత పది రోజుల్లో మూడు శతకాలు బాదిన తిలక్ వర్మ అరుదైన ఘనతలు సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్‌గా హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. శ్రేయస్ ముంబై తరఫున 2019లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో 147 పరుగులు చేశాడు. అంతేగాక టీ20 ఫార్మాట్‌లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి ఇండియన్ ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించాడు.

ఇక మేఘాలయతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. హైదరాబాద్ 180 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ తిలక్ వర్మతో పాటు తన్మయ్ అగర్వాల్ కూడా చెలరేగడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 248 పరుగులు చేసింది.తర్వాత ఛేజింగ్ లో మేఘాలయ 15.1 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. అంకిత్‌రెడ్డి నాలుగు, త్యాగరాజన్ మూడు వికెట్లు తీశారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను 8 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. గత సీజన్ లో ముంబై తరపున లీడింగ్ స్కోర్ గా నిలిచిన ఈ హైదరాబాదీ క్రికెటర్ పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో 3 హాఫ్ సెంచరీలతో 416 పరుగులు చేశాడు.