World Cup 2023: సూర్య సెలెక్షన్.. తిలక్ రిజెక్షన్
ప్రపంచకప్ మహాసంగ్రామం వచ్చేనెల 5 నుంచి ప్రారంభం కానుంది.
వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం కావడానికి నెల రోజుల కంటే తక్కువ సమయమే ఉంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ మహా సంగ్రామం జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ప్రపంచకప్ భారత్ వేదికగా జరగనుంది. ఇందుకోసం 10 వేదికలను సిద్ధం చేశారు. ప్రపంచకప్ కోసం భారత జట్టును కూడా ప్రకటించారు. 15 మంది సభ్యులతో ప్రపంచకప్ లో టీమిండియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ స్థానంలో తిలక్ వర్మను జట్టులోకి తీసుకోవాల్సిందని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ ఈసారి భారత్ లో జరుగుతుంది. భారత్ పిచ్ లు సహజంగానే స్పిన్ కు అనుకూలిస్తాయి. అటువంటి సమయంలో ప్లేయింగ్ ఎలెవెన్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేసే ప్లేయర్లు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిలక్ వర్మ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. ఏ స్థానంలో అయినా ఆడగలడు. ఫీల్డింగ్ లో కూడా మెరుగ్గా ఉన్నాడు. జిడ్డుగా బ్యాటింగ్ చేసే రకం కాదు. పరిస్థితులకు తగ్గట్లు ఆడే ప్లేయర్. తిలక్ వర్మ లాంటి ప్లేయర్ ను ప్రతి జట్టు కూడా కోరుకుంటుంది.
కానీ బీసీసీఐ మాత్రం అతడిని ప్రపంచకప్ కోసం ఎంపిక చేయలేదు. దూకుడుగా ఆడే సూర్యకుమార్ యాదవ్ ను సెలెక్ట్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ కు వేగంగా ఆడటం మాత్రమే వచ్చు అనే అపవాదు ఉంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం రాదని సంజయ్ బంగర్ లాంటి మాజీ ప్లేయర్లు పేర్కొన్నారు. వన్డేల్లో 20 నుంచి 40 ఓవర్ల పాటు జరిగే ఆట చాలా కీలకం. ఈ సమయంలో వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు సాధించాల్సి ఉంటుంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లు గాయాల నుంచి కోలుకుని వస్తున్నారు. శుబ్ మన్ గిల్ ఫ్లాట్ పిచ్ లపైన మాత్రమే ఆడుతున్నాడు. ఇటువంటి సమయంలో తిలక్ వర్మను తీసుకుని ఉంటే జట్టుకు అదనపు బలం చేకూరేది అనే కామెంట్స్ వినబడుతున్నాయి.