Tinmar Mallanna: తెలంగాణ ఎన్నికల బరిలో తీన్మార్ మల్లన్న.. కొత్త పార్టీ పేరు ఏంటో తెలుసా..?
ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తీన్మార్ మల్లన్న. సరికొత్త పార్టీ పెట్టి మేడ్చల్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు.
మల్లన్న ఈ పేరు తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల మొదలు పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరి నోట చర్చించదగ్గ వ్యక్తి. గతంలో ఒక న్యూస్ ఛానల్లో తీన్మార్ వార్తలు చెబుతూ ప్రతి ఒక్కరినీ ఆకర్షించారు. ఆ సంస్థను వీడి ప్రత్యేకంగా క్యూ న్యూస్ అనే పేరుతో ఒక డిజిటల్ మీడియా ప్లాట్ ఫాంపై తన జర్నలిజం ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన కొత్త పార్టీ ని స్థాపించారు. దీనికి తెలంగాణ నిర్మాణ పార్టీ అని పేరు పెట్టారు. ఈ పేరును రిజిష్టర్ చేయాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పేరులో ఏవైనా లోపాలుంటే సెప్టెంబర్ 30 వరకూ గడువు ఇస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తన సైట్లో పొందుపరిచింది.
మల్లారెడ్డిని ఢీ కొట్టనున్న మల్లన్న..
మల్లారెడ్డి తెలంగాణ మంత్రి వర్గంలో చోటు సంపాధించుకొని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువగా మల్లన్న జనాలకు తెలిసేలా ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేశారు. అందులో తమ ల్యాండ్ కబ్జాకు గురైన వారిని పిలిపించి మాట్లాడి న్యాయపరమైన పోరాటం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి మల్లారెడ్డిని ఎలాగైనా రాజకీయంగా దెబ్బతీయాలని నడుంబిగించారు మల్లన్న. మల్లారెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. వీటికి చెక్ పెట్టాలంటే మంత్రి పదవిపై, ఎమ్మల్యేగా గెలవకుండా గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే మేడ్చల్ నుంచి పోటీకి దిగేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
కేసీఆర్ కోటరిని కూల్చేందుకు తొలిఅడుగా..
కేసీఆర్ ఈయన అపర రాజకీయ చాణుక్యుడు అంటారు తలపండిన రాజకీయ విశ్లేషకులు. అలాంటి పర్సనాలిటీని దెబ్బతీయాలంటే చాలా ఓపిక అవసరం. అలాగే రాజకీయ నేర్పరి ఉండాలి. అందుకే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్లను ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి చివరకు కేసీఆర్ ని ఒంటరివాడిగా చేయాలన్న ధ్యేయంతో ముందుకు వెళ్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధముడు మల్లారెడ్డి. ఈయనకు కేసీఆర్ కుటుంబంతో ఉన్న చనువు, వ్యాపార లావాదేవీలు, సాన్నిహిత్యం కొంచం ఎక్కువ. పార్టీలో ఉన్న వాళ్లకంటే కూడా మల్లరెడ్డితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది కేసీఆర్ కి. అందుకే ఇలా అవినీతి బకాసురుల భరతం పట్టి చివరకు కేసీఆర్ ని ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సరైన సమయం కోసం వేచి చూసి సొంత పార్టీ పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచేందుకు సిద్దమౌతున్నాట్లు సమాచారం.
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మంచి ఓట్లు సాధించారు మల్లన్న. ఆ తరువాత కేసీఆర్, కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే బెయిల్ మీద బయటకు వచ్చి తన వ్యవహారాలు తాను సాఫీగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రాజకీయల్లో చురుగ్గా పాల్గొనేందుకు వస్తున్న తరుణంలో ఇంకెన్ని అరెస్ట్ లకు దారితీస్తుందో వేచి చూడాలి.
T.V.SRIKAR