Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల శ్రీవారి ఆదాయం.. వరుసగా 14వ సారి రూ.100 కోట్లు క్రాస్..
తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి 100 కోట్ల మార్క్ దాటింది. ఏప్రిల్ నెలలో భక్తులు శ్రీ వారి హుండీలో వేసిన కానుకల ద్వారా టీటీడీకి 114 కోట్ల 12 లక్షలు ఆదాయం వచ్చింది. దీంతో టీటీడీకి హుండీ ద్వారా వచ్చే ఆదాయం వరుసగా 14వ సారి 100 కోట్లు దాటింది. గతేడాది మార్చిలో మొదటి సారి హుండీ ఆదాయం 100 కోట్లు దాటింది అప్పటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు హుండీ ద్వారా టీటీడీకి 100 కోట్లకు పైగా ఆదాయం వస్తూనే ఉంది.
జూలైలో అత్యధికంగా 139 కోట్ల 45 లక్షలు ఆదాయం వచ్చింది. టీటీడీ చరిత్రలో హుండీ ద్వారా ఈ స్థాయిలో ఆదాయం రావడం అదే తొలిసారి. గతేడాది మార్చిలో 128 కోట్లు, ఏప్రిల్‌లో 127 కోట్ల 50 లక్షలు, మేలో 130 కోట్ల 50 లక్షలు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. లాంగ్ వీకెండ్ హాలీడే రావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. దానికి తోడు ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా రిలీజ్ అవ్వడంతో మొక్కులు తీర్చుకునేవారి సంఖ్య అధికంగా ఉంది.
దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉంటున్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భక్తులకు ఎలాంటిఅసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది.