పాపం ఆండర్సన్..! ఐపీఎల్ కల నెరవేరలేదుగా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. మొత్తం 10 జట్లు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే ఈ సారి విచిత్రంగా స్టార్ ప్లేయర్లు అమ్ముడుపోలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. మొత్తం 10 జట్లు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే ఈ సారి విచిత్రంగా స్టార్ ప్లేయర్లు అమ్ముడుపోలేదు. ఈ జాబితాలో ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఉన్నాడు. 42 ఏళ్ల వయసులో అతను 1.25 కోట్ల కనీస ధర క్యాటగిరీలో తొలిసారి ఐపీఎల్ వేలంలోకి వచ్చాడు. తన రికార్డులను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటారని భావించగా అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు.
జేమ్స్ ఆండర్సన్ ఐపీఎల్ మెగా వేలానికి తన పేరిచ్చినప్పుడు చెన్నై లాంటి బడా జట్లు తీసుకుంటాయని అంతా భావించారు. అభిమానులు కూడా వేలం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఐపీఎల్ టోర్నీలో ఒక్కసారైనా పాల్గొనాలన్న అతని కల కలగానే మిగిలిపోయింది. అయితే అతని బేస్ ధర కోటి రూపాయలు దాటడంతో ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపించకపోయి ఉండొచ్చన్న అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఫ్రాంచైజీలు బలమైన జట్టును తయారు చేసే క్రమంలో సీనియర్లను పక్కనపెట్టేశారు. వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్లు సైతం వేలంలో అమ్ముడుపోలేదు. దీనిబట్టి చూస్తే ఫ్రాంచైజీలు ప్రతిభతో పాటు వయసును కూడా పరిగణలోకి తీసుకున్నారని అర్ధమవుతుంది.
జేమ్స్ ఆండర్సన్ దాదాపు 10 ఏళ్ల క్రితం తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ తరఫున టెస్టు క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. 2024 జూలైలో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో తన చివరి మ్యాచ్ ఆడి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అండర్సన్ టెస్టు క్రికెట్‌లో 704 వికెట్లు, వన్డేల్లో 269 వికెట్లు తీశాడు. తొలి రౌండ్ క్రికెట్‌లో అతని పేరిట 1126 వికెట్లు ఉన్నాయి. అలాగే లిస్ట్ ఎలో 358 వికెట్లు, టీ20లో 41 వికెట్లు తీశాడు. ఈ విధంగా అతని పేరు మీద 1500 పైగా వికెట్లు ఉన్నాయి.