Moon Mining: చంద్రుడిపై ఏమేం ఉన్నాయి ? వాటి మైనింగ్ కు స్కెచ్ !!
చంద్రుడి దక్షిణ ధృవంపై బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు మన "విక్రమ్" కాలు మోపుతాడని ఇస్రో ప్రకటించడంతో.. ఆ అపురూప క్షణం కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
ఇప్పుడు అందరి చూపు చంద్రయాన్-3 వైపే ఉంది. చంద్రయాన్-3 ల్యాండర్ “విక్రమ్” సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని ప్రతి ఇండియన్ మనసారా కోరుకుంటున్నాడు. చంద్రుడి దక్షిణ ధృవంపై బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు మన “విక్రమ్” కాలు మోపుతాడని ఇస్రో ప్రకటించడంతో.. ఆ అపురూప క్షణం కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ తరుణంలో.. చంద్రుడిపై మనిషి ఎందుకు అన్వేషణ చేస్తున్నాడు ? గతంలో జరిగిన మూన్ మిషన్స్ లో ఏం సాధించారు ? ఫ్యూచర్ లో చంద్రుడిపై ఏం జరగబోతోంది ? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చంద్రుడు లేకపోతే..
భూమికి దాదాపు 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉన్నాడు. అంత దూరంలో ఉన్నా భూమికి చంద్రుడు చాలా ముఖ్యం. చంద్రుని ఆకర్షణ శక్తి వల్లే .. మన భూమి స్థిరంగా దాని అక్షంమీద ఉంటోందట. ఒకవేళ చంద్రుడు లేకపోతే.. భూమి అక్షం మీద నిలిచే విధానంలో తేడా వచ్చి భూమి కదలికలలో తేడా వస్తుందట. అదే జరిగితే.. భూమిపై రుతువులు సమయానికి రావు. సముద్రపు ఆటుపోట్లలో కూడా భారీ అలజడి చోటుచేసుకుంటుంది. రోజులో 24 గంటల సమయం కాకుండా.. ఈ వ్యవధిలో హెచ్చుతగ్గులు జరిగే అవకాశాలు ఏర్పడుతాయని సైన్సు నిపుణులు అంటున్నారు.
చంద్రుని లోపల ఏముంది?
చంద్రుడి ఉపరితలంపై వాతావరణం లేదు. భూమితో పోలిస్తే చంద్రునిపై ఆక్సిజన్ స్వల్ప పరిమాణంలో ఉంటుంది. మానవుడు చంద్రునిపై కాలుమోపటానికి ఇదే పెద్ద చాలెంజ్. చంద్రుడిపై పెద్ద గుంతలు (క్రేటర్స్), పర్వతాలు, లోయలు ఉన్నాయి. కానీ చంద్రుడి లోపలి భాగం సిలికేట్‌లతో నిండి ఉంటుంది. విలువైన ఖనిజాలు కూడా ఉన్నాయని అంటారు. హీలియం-3 అనేది హీలియం యొక్క ఐసోటోప్. ఇది భూమిపై అరుదుగా లభిస్తుంది. అయితే చంద్రునిపై భారీగా హీలియం-3 నిల్వలు ఉన్నాయని NASA గుర్తించింది. హీలియం-3తోనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నడుస్తాయి. రేడియేషన్ ను రిలీజ్ చేయకుండా అణు విద్యుత్ ఉత్పత్తికి హెల్ప్ చేసే స్వభావం హీలియం-3 ఐసోటోప్ సొంతం. స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, అధునాతన సాంకేతికతల తయారీలో వాడే స్కాండియం, యట్రియంతో పాటు లాంతనైడ్ రకానికి చెందిన 15 రసాయన మూలకాలు చంద్రునిపై పుష్కలంగా ఉన్నాయి.ఇప్పుడు జరుగుతున్న మూన్ మిషన్స్ వెనుక కూడా ఇలాంటి ఖనిజాలను అన్వేషించాలనే లక్ష్యమే ఉంది.
చంద్రుడిపై మైనింగ్ ప్లాన్స్..
హీలియం-3 కోసం చంద్రుడిపై మైనింగ్ చేయాలనే సీక్రెట్ ప్లాన్స్ తో అమెరికా, చైనా, రష్యాలు ఉన్నాయని టాక్. చంద్రయాన్-1లో చంద్రుడి మీద నీరు ఉందని మన దేశం నిర్ధారించింది. చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కలను పెంచే ప్రయత్నంలో నాసా ఉంది. కాగా, 1969, 1972 మధ్య అమెరికా పంపిన అపోలో మిషన్ల ద్వారా మొత్తం 6సార్లు చంద్రునిపై మనుషులు దిగారు. అపోలో 17 మిషన్ ద్వారా మనుషులు చివరిసారిగా 1972 డిసెంబర్‌లో చంద్రునిపైకి వెళ్లారు.