Top story: వరుస విమాన ప్రమాదాలతో ప్రయాణికుల్లో వణుకు నిన్న అజర్ బైజాన్…నేడు దక్షిణ కొరియాలో విషాదాలు
విమానం ఎక్కాలంటే...భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయా ? నిన్న అజర్ బైజాన్...నేడు సౌత్ కొరియాలో జరిగిన ప్రమాదాలు...సాక్ష్యంగా నిలుస్తున్నాయా ? జాగ్రత్తలు తీసుకోవడంలో విమాన సంస్థలు ఫెయిల్ అవుతున్నాయా ?
విమానం ఎక్కాలంటే…భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయా ? నిన్న అజర్ బైజాన్…నేడు సౌత్ కొరియాలో జరిగిన ప్రమాదాలు…సాక్ష్యంగా నిలుస్తున్నాయా ? జాగ్రత్తలు తీసుకోవడంలో విమాన సంస్థలు ఫెయిల్ అవుతున్నాయా ? లేదంటే పైలెట్ల నిర్లక్ష్యంతో వందల మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయా ? జనం విమానాలెక్కి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారా ?
వరుసగా జరగుతున్న విమాన ప్రమాదాలు…ప్రయాణికులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఒక విమాన ప్రమాదం మరచిపోకముందే…మరో ప్రమాదం జరుగుతుండటంతో…జనం భయాందోళనకు గురవుతున్నారు. విమానం ఎక్కాలంటే…ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎప్పుడు ఎక్కడ ప్రమాదం ముంచుకొస్తుందో…అంతుచిక్కడం లేదు. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత…వందల మంది ప్రాణాల్లో ఆకాశంలోనే పోతున్నాయి. ఫైట్లకు సాంకేతిక సమస్య వస్తుందా ? లేదంటే పక్షి ఢీ కొంటుందా ? అనే భయంతో ప్రయాణికులు గడపాల్సి వస్తోంది. విమాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా…ఊహించని ఘటనలు ఎదురవుతున్నాయి.
ఈ నెల 25న అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి చెచెన్యా రాజధాని గ్రోజ్నీకి…జర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ బయలుదేరింది. గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా దారి మళ్లించారు. అక్టౌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందారు. మిగిలిన 29 మంది సురక్షితంగా బయటపడినట్లు కజకిస్థాన్ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది సహా, 67 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానాన్ని ఓ పక్షి ఢీకొనడంతోనే పైలట్లు అత్యవసరంగా ల్యాండింగ్‌కు ప్రయత్నించినట్లు రష్యా ఏవియేషన్ వాచ్‌డాగ్ తెలిపింది. అయితే విమానంలోని కీలకమైన కంట్రోల్స్, బ్యాకప్ సిస్టమ్స్ విఫలమవడంతో…ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు మరో ప్రచారం జరుగుతోంది. అజర్బైజాన్ ఫ్లైట్ జే2-8243లో కీలకమైన వ్యవస్థలు విఫలం కావడంతోనే…ప్రమాదం జరిగిందని నిపుణులు అనుమానిస్తున్నారు.
అజర్బైజాన్ ప్రమాదాన్ని మరచిపోకముందే…తాజాగా దక్షిణకొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్‌పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయల్దేరిన 7C2216 విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు ఫెయిల్ అయ్యాయని కొందరు అంటుంటే…పక్షిని ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని మరికొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అందుకు బలం చేకూర్చేలా విమానం ల్యాండింగ్ యత్నించే సమయంలో…ఓ ఇంజిన్ నుంచి మంటలే బయటకు వచ్చిన దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విమానం ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడంతో…పైలెట్ బెల్లీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే విమానం పొట్ట భాగం రన్‌వేపై ఉంది. దీంతో ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం కారణంగా…తెరుచుకోకపోవడం వల్ల పైలట్ ఆ విధంగా చేసినట్లు తెలుస్తోంది. 3 కిమీ కంటే తక్కువ పొడవు ఉన్న రన్‌వేపై బెల్లీ ల్యాండింగ్ జరిగితే, అగ్నిమాపక సిబ్బంది ఎందుకు పొజిషన్ తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. విమానం బెల్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నించే ముందు ఎలాంటి చక్కర్లు కొట్టలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మరోవైపు నార్వేలోనూ మరో విమాన ప్రమాదం జరిగింది. కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం…నార్వేలోని ఓస్లో టోర్ప్ శాండెఫ్‌జోర్డ్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత రన్‌వేపై జారిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 182 మంది ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.