Top story ఓటమితో ముగిసిన స్పెయిన్ బుల్ కెరీర్, రఫెల్ నాదల్ కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్స్
క్లే కోర్టులో తిరుగులేని మొనగాడు. ఎర్రమట్టి కోర్టు...అతడికి కంచుకోట. ఒకటా రెండా...ఏకంగా 14 టైటిళ్లు. దిగ్గజాలతో తలపడ్డాడు. అందరిపైనా పైచేయి సాధించాడు. రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్ లకే చుక్కలు చూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్...టోర్నీ ఏదయినా సత్తా చాటాడు. ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగాడు.
క్లే కోర్టులో తిరుగులేని మొనగాడు. ఎర్రమట్టి కోర్టు…అతడికి కంచుకోట. ఒకటా రెండా…ఏకంగా 14 టైటిళ్లు. దిగ్గజాలతో తలపడ్డాడు. అందరిపైనా పైచేయి సాధించాడు. రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్ లకే చుక్కలు చూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్…టోర్నీ ఏదయినా సత్తా చాటాడు. ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగాడు. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో 22 టైటిళ్లు కొట్టాడు. అతడే స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. రెండు దశాబ్దాల పాటు ఆడిన నాదల్…చివరి మ్యాచ్ ఆడేశాడు. ఓటమితో కెరీర్ కు వీడ్కోలు పలికాడు. వివాదాలకు దూరంగా ఉన్నాడు. గొప్ప స్నేహశీలిగా పేరు సంపాదించుకున్నాడు.
టెన్నిస్ దిగ్గం రఫెల్ నాదల్…చివరి మ్యాచ్ ఆడేశాడు. తన చివరి మ్యాచ్ లో విజయం సాధించి…ఘనంగా ముగించాలని దిగ్గజం భావించాడు. రిటైర్ మెంట్ తేదీని నెల రోజులు ముందుగానే ప్రకటించాడు. డేవిస్ కప్ ఫైనల్స్‌లో చివరి మ్యాచ్ అంటూ…సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి అభిమానులకు షాకిచ్చారు. అనుకున్నట్లే నవంబర్ వచ్చింది. డేవిస్ కప్ ఆడాడు. అయితే ఓటమితో తన కెరీర్ ముగించాడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. డేవిస్ కప్‌లో భాగంగా నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ ఓటమిపాలవ్వడంతో నాదల్ కెరీర్ ముగిసింది. తొలి సింగిల్స్‌లో మ్యాచ్‌లోనే పరాజయం పాలయ్యాడు. 4-6, 4-6తో నెదర్లాండ్స్ ప్లేయర్ బొటిక్ వాన్‌డి జాండ్‌షల్ప్ చేతిలో పోరాడి ఓడిపోయాడు నాదల్. రెండు దశాబ్దాలకుపైగా టెన్నిస్ కోర్టునే దేవాలయంగా భావించిన నాదల్…అంతర్జాతీయ కెరీర్ ఓటమితో ముగిసింది.
స్పెయిన్ బుల్ తన అద్భుతమైన ప్రదర్శనతో దాదాపు రెండు దశాబ్దాల పాటు క్లే కోర్టును శాసించాడు. మట్టికోర్టులో మహరాజుగా పేరు సంపాదించాడు. 2005 నుంచి 2022 వరకు ఫ్రెంచ్ ఓపెన్ లో…14 సార్లు విజేత అతడే. అపోనెంట్ ఎవరున్నా…ట్రోఫీ మాత్రం అతడిదే. రఫెల్ నాదల్….కెరీర్ ప్రారంభించిన సమయంలో స్విస్ స్టార్ రోజర్ ఫెదర్, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్…మంచి ఫామ్ లో ఉన్నారు. అప్పటికే వారిద్దరూ అద్భుత ప్లేయర్లు పేరు సంపాదించారు. టెన్నిస్ పై ఎవర్ని కదిపినా…రోజర్ ఫెదరర్, నోవాక్ జకో విచ్ గురించి గొప్పగా చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఎంట్రీ ఇచ్చిన స్పెయిన్ బుల్…రాకెట్ కంటే వేగంగా దూసుకోచ్చాడు. ఎదురులేని విజయాలతో రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్ లకు గట్టి ప్రత్యర్థిగా మారాడు. 2005లో ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ టైటిళ్ల వేట మొదలైంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తొలి టైటిల్ కొట్టిన ఫ్రెంచ్ ఓపెన్ లో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా…చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించేలా ప్రదర్శన చేశాడు.
ఫ్రెంచ్ 2005లో మొదలైన రఫెల్ నాదల్ విజయం ప్రస్థానం…కొన్నేళ్ల పాటు తిరుగే లేకుండా పోయింది. 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022లోనూ విజేతగా నిలిచాడు. 2005 నుంచి 2014 వరకు పది సార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఆడితే… అందులో 9సార్లు ట్రోఫీని అందుకున్నాడు. ఒక్క 2009లో మాత్రమే టైటిల్ కు దూరమయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను 14 సార్లు దక్కించుకున్న ఏకైక మహరాజు రఫెల్ నాదల్. టెన్నిస్ ప్రపంచంలో ఏ ఆటగాడు కూడా ఒక ట్రోఫిని 14 సార్లు అందుకోలేదు. అది స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కు మాత్రమే సాధ్యమైంది. ఎంతో మంది ప్లేయర్లు వచ్చారు…పోయారు. నాదల్ మాత్రం చరిత్రలో నిలిచిపోతాడు. ఇతర గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ సత్తా చాటిన నాదల్…తన కెరీర్‌లో మొత్తం 22 మేజర్ టైటిళ్లను సొంతం చేసుకున్నాడు.
2023 జనవరి నుంచి 15 మ్యాచ్‌లే ఆడాడు నాదల్. అతడి గెలుపోటముల రికార్డు 8-7 ఉంది. చాలా కాలం నంబర్‌వన్‌గా ఉన్న స్పెయిన్ బుల్…ఇటీవల ఎక్కువగా ఆడకపోవడం వల్ల 275వ ర్యాంకుకు పడిపోయాడు. ఈ ఏడాదిఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగాడు. దీంతో తొలి రౌండ్లోనే నాలుగో సీడ్ జ్వెరెవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. కొంతకాలంగా నాదల్ గాయాలతో సతమతమవుతున్నాడు. దీంతో ఈ ఏడాది నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మూడింటిలో పాల్గొనలేదు. డేవిస్ కప్‌నకు ముందు చివరగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాడు. కానీ అక్కడ నాదల్ నిరాశపరిచాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సెర్బియా స్టార్ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. కెరీర్ మొత్తంలో, నాదల్ 36 మాస్టర్స్ టైటిల్స్, రెండు ఒలింపిక్ బంగారు పతకాలు సహా 92 ATP సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. అతడి ఖాతాలో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి.
20 ఏళ్లకుపైగా సుదీర్ఘ కెరీర్ లో ఎక్కడ వివాదాలకు పోలేదు. టెన్నిస్ దిగ్గజం, సహచర ఆటగాడు రోజర్ ఫెదరర్ వీడ్కోల్ పలికిన సమయంలోనూ…రఫెల్ నాదల్ కన్నీటి పర్యంతమయ్యాడు. తానే ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఉద్వేగానికి లోనయ్యాడు. టెన్నిస్ కోర్టులో ఇతర ఆటగాళ్లలో ఎన్నడు ప్రవర్తించలేదు. అందరితోనూ గొప్ప స్నేహశీలిగా పేరు సంపాదించుకున్నాడు. 2024 నాటికి నాదల్ నెట్ వర్త్ సుమారు $225 మిలియన్లు. అతడి ఆదాయంలో ఎక్కువ భాగం టెన్నిస్ నుంచి వచ్చిందే. కెరీర్ మొత్తంలో $135 మిలియన్ల కన్నా ఎక్కువ ప్రైజ్ మనీ అందుకొన్నాడు. 2024లోనే $23.3 మిలియన్లు సంపాదించాడు. ఫోర్బ్స్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం పొందే క్రీడాకారుల్లో నాదల్ ఒకడిగా నిలిచాడు.