కొత్త ఏడాదిలో పసిడి రేటు మళ్లీ పరుగులు పెడుతోంది. రెండ్రోజులుగా బంగారానికి కొత్త కళ వచ్చింది. గతేడాది చివరి రెండు నెలలు తీవ్ర ఒత్తిడిలో ఉన్న పుత్తడి మళ్లీ కాస్త కోలుకునేలా కనిపిస్తోంది. కొంటే ఇప్పుడే కొనుక్కోండి లేకపోతే మీ ఇష్టం అంటూ కవ్విస్తోంది. ఇంతకీ బంగారం కొనడానికి ఇది సరైన సమయమేనా...? 2025లో పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయ్...! మగువల మనసు దోచే పుత్తడికి కొత్త కళ వచ్చింది. కొత్త ఏడాదిలో సరికొత్త దూకుడు ప్రదర్శిస్తోంది. అంతో ఇంతో ఎంతో కొంత పెరుగుతూ గత వైభవాన్ని అందుకోవడానికి పరుగులు తీస్తోంది. గత రెండ్రోజుల్లో 22క్యారెట్ల పసిడి 10గ్రాములు 7వందలు పెరిగింది. 24క్యారెట్లు 770రూపాయలు పెరిగింది. గతంలో బంగారం దూకుడుతో పోల్చితే ఇది భారీ పెరుగుదల కాకపోవచ్చు. కానీ కొత్త ఏడాదితో పసిడి పరుగు గ్యారెంటీ అని చెప్పడానికి ఇది ఓ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22క్యారెట్ల 10గ్రాముల పసిడి 71వేల800, 24క్యారెట్ల పసిడి 10గ్రాములు 78వేల 330రూపాయలుగా ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక బంగారానికి గ్రహణం పట్టుకుంది. భారీగా తగ్గుదల నమోదు చేసింది. త్వరలో లక్ష కొట్టడం ఖాయం అనుకున్నది కాస్తా బిక్కచూపులు చూసింది. రెండు నెలలుగా పసిడి జాతకం బాగోలేదు. అయితే ఇకముందు ఓ లెక్క... ఇప్పట్నుంచి ఓ లెక్క అంటోంది గోల్డ్. కొత్త ఏడాదిలో నా అసలు రూపాన్ని చూపిస్తానంటోంది. నిపుణుల అంచనా ప్రకారం బంగారానికి ఇది బంగారం లాంటి ఏడాదే కావొచ్చు. గత నాలుగేళ్లుగా బంగారం ధర విపరీతంగా పెరిగింది. ఏ ఏడాదీ కూడా మదుపరులను నిరాశపరచలేదు. గత రెండు నెలలుగా కాస్త తగ్గినా కూడా గతేడాది ఏకంగా 26శాతం పెరిగింది పసిడి రేటు. 2023లో 14, 2022లో 12శాతం పెరిగింది. ఆ లెక్కన చూస్తే 2024 నిజంగా గోల్డెన్ ఈయరే. ట్రంప్ అధికారంలోకి వచ్చేవరకు మాత్రమే కాస్త గోల్డ్ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2016లో కూడా ట్రంప్ గెలిచినప్పుడు మొదట్లో కాస్త తగ్గినా తర్వాత పుంజుకుంది. ట్రంప్ ఆర్థిక విధానాలు కూడా దానికి సహకరించాయి. ఈసారి కూడా ఇలాంటి పరిస్థితులే ఉండొచ్చన్నది ఎక్స్‌పర్ట్స్ అంచనా. 2025లో బంగారం కనీసం 10-15శాతం వరకు పెరగొచ్చని లెక్కలు చెబుతున్నాయి. పరిస్థితులు అనుకూలించి ట్రంప్ టారిఫ్ వార్ వంటి వాటికి తెరతీసినా, కవ్వింపు చర్యలకు దిగినా అది ఏకంగా 20శాతానికి పైగా పెరగొచ్చన్నది మరో అంచనా. గతేడాదిలా ఏకంగా 26శాతం పెరుగుదల ఉండకపోయినా మిగిలిన పెట్టుబడి పథకాలతో పోల్చితే బంగారం మంచి రాబడి ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అమెరికా ఫెడ్ నుంచి వడ్డీరేట్లపై స్పష్టత, ట్రంప్ విధానాలపై జనవరి 20తర్వాత క్లారిటీ వస్తుంది. అప్పుడే గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతోందో ఓ అంచనాకు రావొచ్చని ఎక్స్‌పర్ట్స్ లెక్కలేస్తున్నారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్ పాలనలో ప్రభుత్వ అప్పు పెరగడం, ద్రవ్యోల్బణం కట్టడి కాకపోవడం వంటివి బంగారానికి మంచి భవిష్యత్తును ఇవ్వొచ్చు. ప్రస్తుతం కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉన్న గోల్డ్ రానున్న రోజుల్లో బ్రేకవుట్ అవుతుందని అది కూడా అప్‌సైడ్ ఉంటుందన్నది బులియన్ మార్కెట్ చెబుతోంది. వడ్డీరేట్లు తగ్గకపోయినా, డాలర్ బలపడ్డా బంగారానికి అంత మంచిది కాదు. ఈ ఏడాదిలో కూడా అలాంటి కొన్ని సవాళ్లను గోల్డ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయినా పెరగడం మాత్రం గ్యారెంటీ అన్నది లెక్క. చైనా మాన్యుఫ్యాక్చరింగ్ డేటా మార్కెట్లను మెప్పించలేకపోవడం కూడా పసిడికి కలిసొచ్చేదే.. బంగారం ఇప్పుడు కాస్త అందుబాటులోనే ఉందని చెప్పాలి. గతేడాదితో పోల్చితే ఓ మోస్తరుగా తగ్గింది. కొనడానికి ఇదే సరైన సమయం అన్నది మెజారిటీ మాట. తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం కొనుగోలు చేయాలని నిపుణులు కూడా సజస్ట్ చేస్తున్నారు. ఇంకా గోల్డ్ తగ్గుతుందని కొంతమంది అంచనా వేస్తున్నా అది కష్టమే. ఎందుకంటే గోల్డ్ కరెక్షన్ స్టేజ్‌లో ఎప్పుడో ఎంటరైంది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి కోలుకుంటోంది. ఇంకా తగ్గడం అంటే డౌటే. ఒకవేళ పడ్డా దానికి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే త్వరలోనే మళ్లీ కోలుకుంటుంది. ప్రస్తుతం అమెరికా ఇన్వెస్టర్లు న్యూఇయర్ మూడ్‌లో ఉన్నారు. వారు మళ్లీ మార్కెట్‌లోకి ఎంటరైతే కొంత డాలర్ కోలుకుని బంగారం కాస్త తగ్గొచ్చు. అదే ట్రెండ్ జనవరి 20వరకు కంటిన్యూ అయ్యి ఆ తర్వాత మళ్లీ ఊపందుకుంటుందని కొందరు నిపుణుల లెక్క. కానీ ఏది ఎలా ఉన్నా 2025లో కూడా గోల్డ్‌కు తిరుగు ఉండకపోవచ్చు. [embed]https://www.youtube.com/watch?v=AeNiHHyLQ8g[/embed]