Current war: సెంచరీకి దగ్గరవుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి హిట్ వికెట్..అలా అనకుండా ఉండాల్సింది భయ్యా!
ఉచిత కరెంట్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ అలా అనకుండా ఉండాల్సిందంటూ ఆయనపై హస్తం నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.
అప్పటివరకు ఫోర్లు, సిక్సులు, క్విక్ సింగిల్సు తీసి జోరు మీద కనిపించిన ఆటగాడు సడన్‌గా బ్రెయిన్ ఫేడ్ ఐనట్టు బ్యాట్ ఎత్తి వికెట్లు పారేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా..? సెంచరీకి దగ్గర అవుతున్న సమయంలో హిట్ వికెట్‌గా వెనుతిరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా..? తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి ఇంచుమించు ఇలానే కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకు ఆహా..ఓహో అంటూ గొప్పలు పోయిన కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికి వచ్చినట్టే అనిపిస్తోంది. ఉచిత్ విద్యుత్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ నిట్టనిలువునా చీలిపోయింది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్‌లోని కొందరు నేతలు సమర్థిస్తుండగా.. ఈ టైమ్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ మరో వర్గం మండిపడుతోంది.
రేవంత్ ఇలా అనడం కరెక్టేనా:
రైతుల ఓట్లు గంపెడుగా పడలంటే వాళ్లకి నిజంగానే మంచి చేయాలి.. చేస్తామన్న నమ్మకైనా కలిగించాలి ..నెరవేరని హామీలతో మిగిలిన వాళ్లను మోసం చేసే ఛాన్స్ ఉందేమో కానీ రైతులు మాత్రం తప్పుడు వాగ్దానాలను ఈజీగా కనిపెట్టగలరు. అందుకే ఎన్నికలకు ముందు రైతులకు ఏం చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేస్తుంటాయి ప్రభుత్వాలు. రైతులకు మంచి చేసిన ఇలాంటి హామీల్లో ఉచిత విద్యుత్ ఒకటి. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకాన్ని ఇప్పటికీ కేసీఆర్ కొనసాగిస్తున్నారు. ఏకంగా 24గంటలు ఉచిత్ విద్యుత్‌నిస్తూ రైతులకు చేరువయ్యారు కేసీఆర్. కానీ టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఎదిగిన రేవంత్‌రెడ్డికి ఈ పథకం నచ్చలేనట్టుంది. 24గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు అని.. 8గంటలు ఇస్తే చాలు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్‌రెడ్డి.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే:
‘‘తెలంగాణలో 95 శాతం మంది రైతులు 3 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులే. ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట విద్యుత్ చాలు. 3 ఎకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు 3 గంటల విద్యుత్ చాలు. మొత్తంగా 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే నినాదం తీసుకొచ్చారు. ఉచిత కరెంట్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇలాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా చెబుతున్నాం’’ అంటూ అమెరికాలో ఉన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో అధికార బీఆర్‌ఎస్ పార్టీకి మంచి అస్త్రం దొరికినట్టు అయ్యింది. రేవంత్ వ్యాఖ్యలను వ్యతిరేకంగా ఇప్పటికే బీఆర్‌ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది.
నిజానికి ఉచిత్ విద్యుత్ అమలు సరిగ్గా లేదన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. 24గంటలు అని బయటకు చెబుతూ 10గంటలే ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని హైలెట్ చేసి ఉంటే బాగుండేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరింత మెరుగ్గా ఈ పథకాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి ఉండాల్సిదని హస్తం కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలను ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఖండించారు. ఇలా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మంచి జోష్ మీద కనిపించిన తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ వ్యాఖ్యలతో మరోసారి వెనక్కిపోయే ఛాన్స్ కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.