త్వరలో ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram) సీటు ఇప్పుడు అన్నిటికంటే హాట్ సీట్. ఎందుకంటే స్వయంగా జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటు విషయంలో జరిగిన రచ్చ, కొనసాగిన సస్పెన్స్ అంతా ఇంతా కాదు. చివరకు అన్నీ సర్దుకుని జనసేనాని ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ప్రచారం కూడా చేస్తున్నారు. మరోపక్క వైసీపీ (YCP) పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా అప్పుడే మొదలు పెట్టింది. అందుకే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ గురించి ఏ చిన్న అప్‌డేట్ ఐనా క్షణాల్లో హాట్ టాపిక్‌గా మారిపోతుంది. ఇంత క్రేజ్ ఉన్న పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బిగ్‌బాస్ ఫేం, ట్రాన్స్ జెండర్ (Transgender) తమన్నా సింహాద్రి (Tamannaah Simhadri) పోటీ చేయబోతోంది. భారత చైతన్య యువజన పార్టీ నుంచి తమన్నా పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. బిగ్‌బాస్‌తో ఫేమ్ సంపాదించుకున్న తమన్నా చాలా కాలం నుంచి పొలిటికల్ విషయాల్లో కూడా యాక్టివ్‌గానే ఉంది. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తూ.. ఆ పార్టీ నుంచి మద్దతు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ ఎంత ప్రయత్నించినా జనసేనాని నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఈ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసేందుకు కూడా తమన్నా చాలా ప్రయత్నాలే చేసింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో చాలా మంది హేమాహేమీలకే టికెట్ రాలేదు. దీంతో కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న తమన్నా ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ మీదే పోటికి సిద్ధమై అందరికీ షాకిచ్చింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటే చాలు అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా అతనిపైనే పోటీకి రావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈమె ఎఫెక్ట్ పిఠాపురంలో పెద్దగా ఉండే అవకాశం లేకపోయినా.. అంత్యంత కీలక సెగ్మెంట్‌గా ఉన్న పిఠాపురంలో పోటీతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది తమన్నా సింహాద్రి.