మమ్మల్ని వణికించాడు, బుమ్రాపై హెడ్ ప్రశంసలు
వరల్డ్ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ళ ప్రత్యర్థులను పొగడడం చాలా అరుదుగా చూస్తుంటాం... ఎంతో అద్భుతంగా ఆడితే తప్ప ప్రత్యర్థి ఆటగాడి గొప్పతనాన్ని అంగీకరించరు..గతంలో సచిన్ , గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి దిగ్గజాలు మాత్రం ఆసీస్ మాజీల ప్రశంసలు అందుకున్నారు.
వరల్డ్ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ళ ప్రత్యర్థులను పొగడడం చాలా అరుదుగా చూస్తుంటాం… ఎంతో అద్భుతంగా ఆడితే తప్ప ప్రత్యర్థి ఆటగాడి గొప్పతనాన్ని అంగీకరించరు..గతంలో సచిన్ , గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి దిగ్గజాలు మాత్రం ఆసీస్ మాజీల ప్రశంసలు అందుకున్నారు. తర్వాత విరాట్ కోహ్లీ టాలెంట్ ను కూడా కంగారూలు మెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మరో ఆటగాడు కూడా కంగారూలకు వణుకు పుట్టించాడు. ఈ విషయాన్ని ఆ జట్టు ఆటగాళ్ళే అంగీకరిస్తున్నారు. కంగారూలకు వారి సొంతగడ్డపైనే వణుకు పుట్టించిన ఆ ప్లేయర్ ఎవరో కాదు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ సారి భారత్ ఓడిపోయినా బుమ్రా మాత్రం అదరగొట్టేశాడు.
తన బౌలింగ్ తో వారికి చుక్కలు చూపించాడు. పేస్ పిచ్ లపై అద్భుతంగా చెలరేగిన బూమ్రా 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. తాజాగా బుమ్రాపై ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయకపోవడం వల్లే తాము గెలిచామన్నాడు. సిరీస్‌లో బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. తాను టెస్ట్ క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి తాను చూసి అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన బుమ్రాదేనని అభిప్రాయపడ్డాడు.
ఈ సిరీస్‌లో బుమ్రా మాకు ఎన్నో పీడకలలు మిగిల్చాడని గుర్తు చేసుకున్నాడు. బుమ్రా లాంటి అత్యుత్తమ బౌలర్‌ను ఎదుర్కొన్నామని భవిష్యత్తులో ఖచ్చితంగా గుర్తు చేసుకుంటామన్నాడు. సిడ్నీ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయడం లేదనే విషయం తెలిసి తాము సంబరపడ్డామని వెల్లడించాడు. తమ జట్టులోని 15 మంది ఆటగాళ్లను బుమ్రా తన బౌలింగ్‌తో భయపెట్టాడని కితాబిచ్చాడు. వెన్నునొప్పితో సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా బౌలింగ్ కు రాలేదు. దీంతో ఆసీస్ 4 వికెట్లు కోల్పోయినా చివరకు మ్యాచ్ గెలిచింది.