Tirumala: చేతిలో కర్రను చూసి పులి పారిపోతుందా..? తెలివి తక్కువ నిర్ణయం

కర్రలు చేతికి ఇచ్చి ప్రాణాలు కాపాడుకోమంటున్న టీడీడీ

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 7, 2023 | 11:23 AMLast Updated on: Sep 28, 2023 | 5:56 PM

Ttd Is Distributing Hand Sticks To Protect Against Leopard Attacks

దేవుడి దర్శనానికి బయల్దేరితే.. బాబోయ్‌ పులి అనే పరిస్థితి వచ్చింది..! ఏడుకొండలపై ఎట్నుంచి ఏ చిరుత వచ్చి దాడి చేస్తుందో తెలీని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతకు భరోసా ఇచ్చి భక్తులకు ధైర్యం చెప్పాల్సిన టీటీడీ చేతిలో కర్రలు పెడుతోంది. కర్రపట్టుకుని అదిలిస్తే క్రూర మృగాలు పారిపోతాయ.? ఈ మాత్రం బుర్ర టీటీడీకి లేదా? ఎలాంటి ఏర్పాట్లయినా చేయగల సత్తా ఉన్న దేవస్థానం.. ఇలాంటి తలతిక్క నిర్ణయం ఏంటి? ఇప్పుడు జనం అంతా అడుగుతున్న ప్రశ్న ఇదే..!

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు నడకమార్గంలో వెళ్లడం దశాబ్దాలుగా వస్తోంది. నడకమార్గంలో శ్రమ తెలియకుండా శ్రీవారి దివ్యనామాన్ని స్మరించుకుంటూ భక్తులు ముందుకెళతారు. అయితే ఇటీవలి కాలంలో చిరుతలు , ఇతర వన్యప్రాణులు.. భక్తులపై విరుచుకుపడుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ బాలుడు తృటిలో ప్రాణాలు దక్కించుకోగా.. మరో చిన్నారి చిరుతకు బలైంది. దీంతో భక్తుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన టీటీడీ.. ఆపరేషన్ చిరుత పేరుతో చిరుతలను బంధిస్తోంది. ఇప్పటికీ 5 చిరుతల్ని పట్టుకుంది. అయితే రోజుకొకటి బయటపడుతుండడంతో.. ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భక్తులకు కర్రల పంపిణీ కూడా ఒకటి. అయితే

మనిషి చేతిలో కర్రను చూసి క్రూరమృగాలు భయపడతాయా?

పక్కాగా టార్గెట్ చేసి దాడికి దిగే మృగాలు కర్రను చూస్తే భయపడిపోతాయా? టీటీడీ కర్రల పంపిణీ ఎంతవరకూ పనికొస్తుంది? మనిషి చేతిలోని కర్రను చూస్తే పెంపుడు జంతువులు భయపడొచ్చేమో కానీ.. కొండా,కోనల్లో తిరిగే క్రూరమృగాలు భయపడతాయా? పులులు, ఎలుగు బంట్లకి వాటి టార్గెట్ ఎంచుకోవడం, అదనుకోసం వేచి చూడడం, ఒక్కసారిగా దాడి చేసి చంపేయడం మాత్రమే వాటికి తెలిసిన విద్య. ఒక్క వేటకోసం క్రూరమృగాలు.. గంటల తరబడి వేచి చూస్తాయి. వేట చిక్కుతుందన్న నమ్మకం కలిగాకే వేటకు దిగుతాయి. మరి అంత పకడ్బందీగా వేటాడే క్రూరమృగాలు.. ఓ చిన్న కర్రను చూసి పారిపోతాయా? ఈ వాదన తిరుమల తిరుపతి దేవస్థానానికి అనవసరం. అందుకే మొండిగా భక్తులకు కర్రల పంపిణీ చేస్తోంది.

టీటీడీ ఇచ్చే కర్రతో ఎవరి కుటుంబాన్ని వారే రక్షించుకోవాలా?

చిన్నారులతో కొండకు వెళ్లే భక్తుల పరిస్థితి ఏంటి? చిన్నారుల రక్షణ ఎలా సాధ్యం? నడకమార్గంలో వెళ్తున్న భక్తుడికి కర్ర ఇచ్చి.. నీకుటుంబాన్ని నువ్వే రక్షించుకో అని చెబుతోంది టీటీడీ .ఇక కుటుంబంలోని వ్యక్తికి కర్ర ఇచ్చి, కుటుంబం మొత్తం సురక్షితంగా నడకమార్గంలో నడిచి వెళ్లమని టీటీడీ చెబుతోంది. అది అంత ఈజీనా.. చేతిలో కర్రచూస్తే పారిపోతాయా ?. మృగాలు సైతం తెలివిమీరాయి. గతంలో నిప్పు చూస్తే భయపడి పారిపోయే మృగాలు.. ఇప్పుడు దాన్ని ఖాతరు చేయని పరిస్థితి ఉంది. ఇక చిన్నారులు.. కుటుంబసభ్యులతో కొండెక్కే పరిస్థితుల్లో వారిని ఎంతసేపు పట్టుకుని ఉంటారు. పిల్లలకు ఆటవస్తువు కనిపిస్తే చాలు, చెయ్యి విదిలించుకు పారిపోతారు. అలాంటప్పుడు వారి రక్షణ ఎలా సాధ్యం? శ్రీవారి నడకమార్గం ఉన్న ఏరియా మొత్తం ఇనుక కంచె వేయాల్సిన అవసరముంది. అప్పుడే మృగాలు.. జనారణ్యంలోకి రావడం ఆగిపోతుంది.అంతే కాని కర్ర ఇస్తున్నాం.. మిమ్మల్ని మీరే రక్షించుకోండి అని అంటే వేల కోట్ల టీటీడీ ఆస్తులు ఏం చేస్తున్నట్లు?