Udayanidhi: ఉదయనిధి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.. అసలేమైంది ?
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లతో రాజకీయ రగడ మొదలైంది.
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లతో రాజకీయ రగడ మొదలైంది. తీవ్ర విమర్శలు రావడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ‘‘సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ లాంటిదని.. దాన్ని నిర్మూలించాలి’’ అని చేసిన కామెంట్స్ పై సంజాయిషీ చెప్పారు. అయితే సోషల్ మీడియాలో ఆయనకు చాలామంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. ‘‘సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని నిర్మూలించాలని నేను అన్నట్టుగా కొంతమంది తప్పుడు ప్రచారం చేశారు. నేను అలా అనలేదు. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారి గురించి నేను మాట్లాడలేదు. సనాతన ధర్మాన్ని మాత్రమే నిర్మూలించాలని అన్నాను. సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విడదీసే సిద్ధాంతమని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను నా ప్రకటనకు కట్టుబడి ఉన్నాను’’ అని తాజాగా ఇచ్చిన వివరణలో ఉదయనిధి స్టాలిన్ చెప్పారు.
కోర్టులో సవాల్ చేస్తాం : లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ
‘‘సనాతన ధర్మంపై పెరియార్, అంబేద్కర్ చేసిన లోతైన కృషిని, సనాతనం ధర్మంవల్ల కలిగే దుష్ఫలితాలను మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. “నేను నా ప్రసంగంలోని కీలకమైన భాగాన్ని రిపీట్ చేస్తున్నాను. కొవిడ్-19, డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందినట్లే.. అనేక సామాజిక దురాచారాలు వ్యాప్తి చెందడానికి సనాతనం కారణమని నేను నమ్ముతున్నాను. నా వాదనలపై ఇటు న్యాయస్థానంలోనైనా, అటు ప్రజా న్యాయస్థానంలోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను’’ అని తాను కామెంట్ చేశానని ఉదయనిధి గుర్తు చేశారు. ఇక ఉదయనిధి ప్రసంగాన్ని కోర్టులో సవాల్ చేస్తామని లీగల్ యాక్టివిజంతో సంబంధం ఉన్న లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ వెల్లడించింది. ‘‘వేరొకరి ప్రోద్బలంతో సనాతన ధర్మాన్ని దూషించే వారిని దోమల్లా తుడిచిపెట్టేందుకు న్యాయపరమైన అవకాశాలను వెతుకుతాం. ఉదయనిధిని క్షమించం” అని అబ్జర్వేటరీ కామెంట్ చేసింది.
సనాతనం అనే మాటలను ఉదయనిధి అర్ధం చేసుకోలేకపోయారు
‘‘సనాతన ధర్మం శతాబ్దాల తరబడి కొనసాగుతోంది. అన్ని మతాలు, వర్గాలు దాని నుంచే ఉద్భవించాయి. భవిష్యత్తులో కూడా ఇది అలాగే ఉంటుంది. దీన్ని ఎవరూ చెరిపేయలేరు. ఉదయనిధి కాదు, ఇంకెవరు వచ్చినా ఆ పని చేయలేరు’’ అని రామజన్మభూమి చీఫ్ మహంత్ ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ‘‘సనాతనం అనే మాటలను ఉదయ నిధి అర్ధం చేసుకోలేకపోయారు. అందుకే దాన్ని నిర్మూలించాలని మాట్లాడుతున్నారు. ఆయన చెప్పింది పూర్తిగా తప్పు’’ అని పేర్కొన్నారు. ఉదయనిధిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై కూడా ట్విటర్ లో కౌంటర్ ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్, ఆయన తండ్రి వారి సిద్ధాంతకర్తలు క్రైస్తవ మిషనరీల నుంచి ఆలోచనలను కొనుగోలు చేశారని ఆరోపించారు. మిషనరీల ఆలోచనలు మూర్ఖులకు వారి దురుద్దేశపూరిత భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ లీడర్ రాజాసింగ్ కూడా దీనిపై స్పందించారు.