బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కొంపముంచుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా విషయంలో అంపైర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీంతో గెలిచే మ్యాచ్ లు చేజారుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సిడ్నీ టెస్టులో కూడా బ్యాడ్ అంపైరింగ్ స్పష్టంగా కనిపించింది. అంతకుముందు మ్యాచ్‌లో కూడా అంపైరింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి అంపైర్ తప్పుడు నిర్ణయాలతో మాజీ ఆటగాళ్లతో సహా క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు. సిడ్నీ టెస్టులో విరాట్ కోహ్లీ అంపైర్ తప్పుడు నిర్ణయం నుంచి తృటిలో బయటపడ్డాడు కోహ్లి డీఆర్‌ఎస్ తీసుకోవడంతో నాటౌట్ అయ్యాడు. కోహ్లీ తర్వాత వాషింగ్టన్ సుందర్ విషయంలోనే ఇదే సీన్ రిపీట్ అయింది. వాషింగ్టన్ సుందర్ క్యాచ్ అవుట్ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ డెలివరీని ఆడేందుకు వాషింగ్టన్ సుందర్ ప్రయత్నించాడు. అయితే బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఫీల్డ్ అంపైర్ సైకత్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీని తర్వాత పాట్ కమిన్స్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ విల్సన్ చాలా సేపు రీప్లేలు చూసాడు. బంతి గ్లౌజ్‌ల దగ్గర నుంచి వెళ్ళింది. కానీ స్నికోమీటర్‌లో స్పైక్ లేనప్పటికీ, బంతి సుందర్ గ్లవ్స్‌కు తగిలి కీపర్‌కి వెళ్లిందని నిర్ణయించుకున్నాడు. దీంతో సుందర్ ఔట్ గా ప్రకటించాడు. అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం చర్చకు దారితీసింది. జోయెల్ విల్సన్ తప్పుడు నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడ్డారు. టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప కూడా అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. వాషింగ్టన్ సుందర్ వికెట్ విషయంలో బుమ్రా కూడా అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బాక్సింగ్ డే టెస్టులోనూ యశస్వి జైశ్వాల్ ఔట్ తీవ్ర వివాదాస్పదమైంది. ఫీల్డర్లు అప్పీల్ చేస్తే చేశారు.. థర్డ్ అంపైర్ కు కళ్ళు పోయాయా అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అసలు అంపైరింగ్ అంటే తటస్థంగా ఉండాలి కానీ ఇలా ఒక జట్టుకు సపోర్ట్ లా వ్యవహరిస్తారా అంటూ మండిపడుతున్నారు. యశస్వి బ్యాట్‍కు బంతి తగిలినట్టు స్నికో మీటర్‌లో చూపించకపోయినా థర్డ్ అంపైర్ ఓ కారణం వల్ల ఔట్ ఇచ్చేశారు. మ్యాచ్ లో ఆసీస్ గెలుపుకు, భారత్ ఓటమికి ఇదే టర్నింగ్ పాయింట్. బంతి దిశ మారిందనే కారణంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. ఈ ఔట్ పై స్టేడియంలోని భారత్ ఫ్యాన్స్ తీవ్ర నిరసన తెలిపారు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో అంపైరింగ్ తప్పిదాలు హాట్ టాపిక్ గా మారాయి. టెక్నాలజీ ఉన్నా కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అటు సోషల్ మీడియాలోనూ అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై మండిపడుతున్నారు. ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్, జైస్వాల్ విషయంలోనూ ఇదే తప్పిదం చోటు చేసుకుంది. భారత్, ఆసీస్ సిరీస్ లో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి చెత్త అంపైరింగ్ కనిపించడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.[embed]https://www.youtube.com/watch?v=kPhI1vga_I4[/embed]