Amith Sha: రేపు తెలంగాణకు రానున్న అమిత్ షా.. 27న జరిగే సూర్యాపేట బహిరంగ సభకు హాజరు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 27న సూర్యాపేటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది. ఒకవైపు మూడో సారి అధికారం కోసం బీఆర్ఎస్ సుడిగాలి పర్యటనలు చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు కొనసాగిస్తోంది. బీజేపీ ఇటీవలె అభ్యర్థుల తొలిజాబితా ప్రకటించి జోష్ ను కనబరుస్తోంది. ఇదే వేగాన్ని ప్రచారంలోనూ కొనసాగించాలని భావిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం రాత్రి హైదరాబాద్ రానున్నారు. ఈనెల 27 న హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొంటారు. ఈ తరువాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సూర్యాపేటలో నిర్వహించే సభకు హాజరవుతారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు తెలిపారు.
గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నవెంటనే ఇక్కడి పరిస్థితులపై నాయకులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మంగళవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు పాల్గొని చర్చలు జరిపారు. నేడు కోదాడ, హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థులన ప్రకటిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన వ్యూహాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని సభకు కేటాయించేందుకు పరిశీలించారు. నేటి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి.
T.V.SRIKAR