Amit Shah: ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత.. కొత్తగా ఏముంది ?
బ్రిటీష్ వాళ్ల కాలం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ స్థానాన్ని భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
భారత శిక్షాస్మృతి (ఐపీసీ) త్వరలోనే చరిత్ర పుటల్లో కలిసిపోబోతోంది. బ్రిటీష్ వాళ్ల కాలం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ స్థానాన్ని భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), సాక్ష్యాధార చట్టాల స్థానంలో భారతీయ సాక్ష్యా (బీఎస్)ను తీసుకొచ్చేటందుకు ఉద్దేశించిన మరో రెండు బిల్లులను కూడా ఆయన ప్రవేశపెట్టారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో వీటికి పార్లమెంటు ఆమోదం లభించే ఛాన్స్ ఉంది. ఈనేపథ్యంలో భారత శిక్షాస్మృతి (ఐపీసీ) స్థానంలో అమల్లోకి రానున్న భారతీయ న్యాయ సంహితలో ఎలాంటి అంశాలను ప్రతిపాదించారు అనేది ఇపుడు తెలుసుకుందాం.
సెక్షన్ 302.. ఇక “బీఎన్‌ఎస్ 99”
ఇప్పటిదాకా హత్యా నేరానికి భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 302 కింద నమోదు చేస్తున్నారు. ఇకపై అది “బీఎన్‌ఎస్ 99″గా మారిపోతుంది. దేశద్రోహ(రాజద్రోహ) చట్టాన్ని (సెక్షన్ 124ఏ) కేంద్రం పూర్తిగా రద్దు చేశారు. అయితే దాని స్థానంలో 150 సెక్షన్‌ను తీసుకొచ్చింది. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలుగజేసే చర్యలు, వేర్పాటు వాదం, సాయుధ తిరుగుబాటు, విధ్వంసకర కార్యకలాపాలు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. ఈ నేరాలకు గరిష్ఠంగా జీవిత ఖైదు పడుతుంది. మూక హత్యలకు మరణదండనను ప్రతిపాదించింది. ఈ బిల్లులు చట్టరూపం దాలిస్తే ప్రతిఒక్కరికీ గరిష్ఠంగా మూడేళ్లలోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. చిన్న చిన్న నేరాలకు పాల్పడేవారికి సామాజిక సేవ శిక్ష విధించాలని ప్రతిపాదించారు.
డిజిటల్ రెక్కలతో నేర దర్యాప్తుకు స్పీడ్..
భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) అమలులోకి వచ్చాక పోలీసులు తనిఖీ ప్రక్రియలను తప్పనిసరిగా వీడియో తీయాలి. ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి కేసు డైరీ వరకు, చార్జిషీట్ నుంచి న్యాయం అందే వరకు అన్నీ డిజిటలైజ్ అవుతాయి. 2027 నాటికి అన్ని కోర్టులనూ కంప్యూటరైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మూడు మొబైల్ ఫోరెన్సిక్ లేబొరేటరీలు ఏర్పాటు చేస్తామని సర్కారు అంటోంది. 90 రోజుల్లో ఎఫ్‌ఐఆర్‌ను అప్‌డేట్ చేయాలి. జీరో ఎఫ్‌ఐఆర్ విధివిధానాలను కూడా ఖరారు చేశారు. సివిల్ సర్వెంట్ల ప్రాసిక్యూషన్‌కు నిర్దిష్ట గడువులోగా అనుమతి ఇవ్వాలి. నేర నిర్ధారణలు 90 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సశాస్త్రీయంగా నేర నిరూపణ చేయడానికిగానూ.. ఏడేళ్లు, అంతకుమించిన జైలుశిక్ష పడేందుకు వీలున్న కేసుల్లో నేర ఘటన జరిగిన ప్రాంతాలను ఫోరెన్సిక్ బృందాలు తప్పనిసరిగా సందర్శించాలి.
అత్యాచారాలపై కఠిన వైఖరి
12 ఏళ్లకు తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష, గ్యాంప్ రేప్ చేస్తే 20 ఏళ్లు జైలుశిక్ష విధించాలని పేర్కొంది. ఈ నేరానికి జరిమానాతో పాటు జీవిత ఖైదు లేదా మరణదండన కూడా విధించవచ్చని భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లో ప్రతిపాదించారు. పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం, ప్రమోషన్లు ఇప్పిస్తామని మహిళలను లైంగికంగా లొంగదీసుకోవడం, మారు పేరుతో వ్యవహరించడం నేరం. అత్యాచార నిందితులకు కనీసం పదేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదు.. సామూహిక అత్యాచారాలకు కనీసం 20 ఏళ్ల జైలు లేదంటే జీవించి ఉన్నంతవరకు కారాగార శిక్ష విధిస్తారు.. అత్యాచారం తర్వాత బాధిత మహిళ మరణించినా.. కోమాలోకి వెళ్లినా.. నిందితుడికి గరిష్ఠంగా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. దానిని జీవిత ఖైదుకు పెంచవచ్చు. ఎవరైనా పోలీసు అధికారి/పబ్లిక్ సర్వెంట్/సాయుధ బలగాల సభ్యుడు అత్యాచారానికి పాల్పడితే కనిష్ఠంగా పదేళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష విధించాలి. దీనిని జీవిత ఖైదుకు పొడిగించవచ్చు.
ఎన్నికల నేరాలపై ఒక చాప్టర్..
భారతీయ న్యాయసంహితలో ఎన్నికలకు సంబంధించి ఒక అధ్యాయాన్ని చేర్చారు. ఓటర్లను ప్రలోభపెట్టడం లేదా తాయిలాలు స్వీకరించడం లంచానికి సంబంధించిన నేరంగా భావిస్తామని పేర్కొన్నారు. అయితే ఓటర్లకు ఇచ్చే హామీని ఒక విధానంగా బహిరంగంగా ప్రకటిస్తే అది నేరం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల నేరాలు, లంచాలు, అభ్యర్థుల వ్యయంలో అవకతవకలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఐపీసీ సెక్షన్లు 171ఏ-171ఎల్ పరిధిలోకి వస్తున్నాయి. బీఎన్‌ఎస్ లోని 9వ అధ్యాయంలో వీటిని 167-175 సెక్షన్లలో చేర్చారు.
కిడ్నాప్, దోపిడీలకూ మరణశిక్ష లేదా జీవిత ఖైదు
కిడ్నాప్, దోపిడీలు, వాహనాల దొంగతనాలు, మామూళ్ల వసూళ్లు, భూకబ్జాలు, కాంట్రాక్టు హత్యలు, ఆర్థిక నేరాలు, తీవ్ర సైబర్ నేరాలు, మనుషుల అక్రమ రవాణా, వ్యభిచారం చేయించడానికి అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, సిండికేట్ బెదిరింపులు, భయపెట్టడం, బలప్రయోగం, అవినీతి, ఆర్థిక, ఇతరత్రా ప్రయోజనాలను ఆశించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం సంస్థాగత నేరాల కిందకు వస్తాయి. ఈ నేరానికి పాల్పడినా.. అందుకు ప్రయత్నించినా.. దానివల్ల ఎవరైనా మరణించినా.. మరణ శిక్ష లేదా జీవిత ఖైదు తప్పవు. రూ.10 లక్షల జరిమానా కూడా విధిస్తారు.
తొలిసారిగా ఉగ్రవాదానికి నిర్వచనం..
ఉగ్రవాదం అంటే ఏమిటో కేంద్రం తొలిసారి నిర్వచించింది. “భారతదేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా దేశం బయట లేక లోపల ఉండి ప్రయత్నించేవారంతా ఉగ్రవాదులే. దేశ విచ్ఛిన్నంలో భాగంగా జనజీవనాన్ని లేక అందులోని ప్రధాన సమూహాన్ని భయభ్రాంతులకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడాన్ని ఉగ్రవాద చర్యలుగానే పరిగణించాలి. ఈ చర్యలకు పాల్పడినా.. తద్వారా మరణాలు సంభవించినా.. మరణశిక్ష లేదా పెరోల్ లేకుండా జీవిత ఖైదు విధించవచ్చు. రూ.10 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు. ఉగ్రవాద నేరం రుజువై యావజ్జీవ శిక్ష పడినవారి శిక్షాకాలం తగ్గించే అంశాన్ని ఏడేళ్ల శిక్ష అనుభవించిన తర్వాతే పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నేర చర్యలకు పాల్పడినవారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు” అని నిర్వచనంలో పేర్కొన్నారు.