Sky Bus: భారత్ కు త్వరలో స్కై బస్ తెస్తామన్న నితిన్ గడ్కరీ.. అసలు ఏంటి ఈ టెక్నాలజీ..?

స్కై బస్ ఇది చూడటానికి అచ్చం మెట్రోలాగానే ఉంటుంది. దీనిని మన దేశంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 25, 2023 | 12:11 PMLast Updated on: Oct 25, 2023 | 12:13 PM

Union Transport Minister Nitin Gadkari Said That Sky Bus Technology Will Be Brought To India

నితిన్ గడ్కరీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్ లో రోడ్డు భద్రతపై మంత్రి వర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఇలా వచ్చే క్రమంలో షార్జాలో దిగారు. అక్కడి స్కై టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో స్కై బస్ లో ప్రయాణం కూడా చేశారు. ఈ ఫోటోలు తన ఎక్స్ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. దీంతో పాటూ ఒక సందేశాన్ని రాశారు. స్కై టెక్నాలజీ ద్వారా రూపొందించబడిన ఈ స్కై బస్ ను భారతదేశానికి తీసుకురావడం ద్వారా మొబిలిటీ సేవలను అభివృద్ది చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా స్కై బస్ మరో సారి చర్చనీయాంశమైంది. దీనిని ఇటలీలోని బోలోగ్నా యూనివర్సిటీ మొట్టమొదటి సారిగా అభివృద్ది చేసింది.

మన దేశంలో స్కై బస్ టెక్నాలజీని తీసుకురావడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పర్యావరణానికి హాని కలుగకుండా ఉంటుంది. ప్రజలకు మరింత మెరుగైన రావాణా సౌకర్యాలను అందించడంలో దోహదపడుతుంది. అలాగే తక్కువ ధరకూ త్వరగా ప్రయాణం చేసే వెసులుబాటు ఉంటుంది. వీటి నిర్వహణ మెట్రో ఖర్చుల కంటే తక్కువ ఉంటుంది. ఇది విలోమ కాన్ఫిగరేషన్ వాహనం. చూసేందుకు తలకిందులుగా కనిపిస్తుంది. మెట్రో రైలు ట్రాక్ పైన నడిస్తే.. ఈ స్కై బస్సులు ట్రాక్ కింద తలకిందులుగా ప్రయాణం చేస్తాయి. దీని చక్రాలు, ట్రాక్లు కాంక్రీట్ పిల్లర్లకు లోపల అమరి ఉంటాయి. తద్వారా మనకు చేసేందుకు ఇవేవీ కనిపించవు. ట్రాక్ ప్లాట్ ఫాం కు వేలాడదీయబడి ఉండటం వల్ల ఈ టెక్నాలజీ పట్టాలు తప్పడం లాంటి ప్రమాదాలకు గురికాదు. ప్రజల ప్రాణాలకు పూర్తి భద్రత ఉంటుంది. ఈ స్కై బస్సులు గంటకు 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. రెండు లేదా మూడు కోచ్ లు కలిగి ఉంటుంది. ఒక్కో కోచ్ లో 300 మంది ప్రయాణీకులను గమ్యస్థానాలను చేరవేస్తుంది.

ఈ ప్రాజెక్టును 2003లో అటల్ బిహారీ వాజ్ పేయి నూతన సంవత్సర కానుకగా గోవాకు స్కై బస్ ను ప్రకటించారు. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ ప్రాజెక్టు ఆదిలోనే హంసపదం అన్నట్లు అటకెక్కింది. 2004 సెప్టెంబర్ 25న కోచ్ లు కాంక్రీట్ ట్రాక్ పిల్లర్లను ఢీ కొనడంతో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఒక ‎ఉద్యోగి మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. అప్పట్లో దీనిని కొంకణ్ రైల్వే గోవా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో గోవాలోని మార్గోవాలో ట్రయల్ రన్ చేసింది.

T.V.SRIKAR