Chandrababu: చంద్రబాబు 6 నెలలు జైల్లో ఉండక తప్పదా?
ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు రిమాండ్ వ్యవహారం ఇంకెన్నాళ్లు నడుస్తుందనేది తేలడం లేదు. ప్రస్తుతానికి స్కిల్ డెవలప్ మ్ంట్ కేసు విచారణ అటు సుప్రీంకోర్టు, ఇటు ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉంది. మరోవైపు కొత్తగా అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో విచారణకు పీటీ వారెంట్ పిటిషన్లు, వీటిపై బెయిల్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ విచారణలు ముగిసేదెప్పుడు..? కేసులు నుంచి బయటపడేదెప్పుడు.
చంద్రబాబు కేసుల్లో విచారణ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి అక్టోబర్ 19 వరకు రిమాండ్ ఉన్నా.. తర్వాతేంటి అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కరువైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు సెప్టెంబర్ 9 న బాబు అరెస్ట్ దగ్గర్నుంచి ఇప్పటిదాకా అనేక మలుపులు తిరిగింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 10న ఏసీబీ కోర్టు జడ్జి.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడిషయన్ కస్టడీ విధించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని, సీఐడీ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలని చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు. రెండ్రోజుల హైడ్రామా తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని, సీఐడీ ఇప్పటికే 4 వేల పేజీలు డాక్యుమెంట్లు సేకరించిందని, 140 మంది సాక్షుల్ని విచారించింందని, ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పింది. దర్యాప్తు చేస్తున్న సీఐడీకి స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉందని చెబుతూ.. బాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయ్యాక.. రెండు రోజుల సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ.. ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు లాయర్లు మొదట్నుంచీ కేసు మెరిట్స్ కంటే సాంకేతిక అంశాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలన్న హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ.. చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా, భట్టి డివిజన్ బెంచ్ మందుకు పిటిషన్ వచ్చింది. ఇద్దరు జడ్జిలు నాట్ బిఫోర్ మి అనడంతో.. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వెంటనే సీజేఐని ఆశ్రయించారు. సీజేఐ ముందు క్వాష్ పిటిషన్ పై వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమన్న సీజేఐ.. అక్టోబర్ 3కి విచారణ వాయిదా వేశారు. ఆ కేసు మళ్లీ అక్టోబర్ 9 కి వాయిదా పడింది.
ఇలా స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ ఏసీబీ కోర్టులో మొదలై ఏపీ హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు అటు సుప్రీంకోర్టులో, ఇటు ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉండటంతో.. ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. విచారణ ఎప్పటికి కొలిక్కి వస్తుంది..? ఇంకెన్నాళ్లు వేచిచూడాలి..? అనేవి మిలియన్ డాలర్ ప్రశ్నలుగా మిగిలింది
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏ విషయం తేలకముందే.. చంద్రబాబుని కేసులు చుట్టుముడుతున్నాయి. కొత్తగా అంగళ్లు, ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో విచారణ కోసం దర్యాప్తు అధికారులు పిటిషన్లు వేశారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్లు వేశారు. ఇవి ఏ తీరానికి చేరతాయనేది చూడాల్సి ఉంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా బాబు న్యాయపోరాటం చేస్తుండగానే.. మరోవైపు ఇతర కేసుల్లో విచారణ కోసం సీఐడీ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్లు వేసింది. అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. అటు చంద్రబాబు మళ్లీ ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసుల్లోనూ ఇరువర్గాల మధ్య హోరహోరీ వాదనలు జరుగుతున్నాయి. క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా.. కొత్త కేసుల్లో పీటీ వారెంట్లకు ఎలా అనుమతిస్తారని చంద్రబాబు తరపు లాయర్లు అడుగుతుంటే.. కొత్త కేసుల్లో అరెస్ట్ చేసుకోవచ్చని ప్రభుత్వం తరుపు లాయర్లు కౌంటర్ ఇస్తున్నారు. ఇరు వర్గాలు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావిస్తున్నారు. ఎక్కువ కేసుల రిఫరెన్సులు ఇవ్వడం వల్ల కూడా జడ్జిలకు స్టడీ చేయడానికి ఎక్కువ సమయం పడుతోందనే వాదన వినిపిస్తోంది. మొత్తం మీద ఎవరూ వెనక్కి తగ్గకుండా సర్వశక్తులు ఒడ్డి ప్రతి కేసులోనూ వాదనలు వినిపిస్తున్నారు. దీంతో విచారణ అంత త్వరగా తేలే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా ఎన్నాళ్లు జరుగుతుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న.
ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారని ఏసీబీ జడ్జి అసహనం వ్యక్తం చేశారు. మిగతా కేసులు కూడా చూడాలి కదా అని ప్రశ్నించారు. మరి మిగతా కేసుల్లో అయినా వాదన త్వరగా తెగుతుందా.. లేకపోతే కొత్త పిటిషన్లు దాఖలౌతాయా అనేది చూడాల్సి ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తమ సన్నిహితులకు లబ్ధి కలిగేలా అలైన్ మెంట్ మార్చారనేది సీఐడీ అభియోగం. అయితే కేవలం కాగితాలకే పరిమితమై ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టడమేమిటనేది బాబు తరపు లాయర్ల ప్రశ్న. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్, హెరిటేజ్ ఫుడ్స్ పై కూడా సీఐడీ అభియోగాలు మోపింది. ఇన్నర్ రింగ్ రోడ్ ఊహాజనితమని, లేని రోడ్డు అలైన్ మెంట్ మార్పు, అనుచిత లబ్ధి జరిగిందని ఎలా ఆరోపిస్తారని చంద్రబాబు తరపు లాయర్లు నిలదీస్తున్నారు. స్కిల్ డెలవప్ మెంట్ కేసు తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లోనే ఉంది.
ఇప్పటివరకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులోనే పిటిషన్ల సంగతి ఎటూ తేలలేదు. కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది. ఇలా ప్రతి పిటిషన్ కు ఎక్కడికక్కడ డెడ్ లాకులు పడుతుండటంతో.. విచారణ ఎప్పటికి పూర్తవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఏమీ తేలకముందే కొత్త కేసులు, పిటిషన్లు వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం తేలేదెప్పుడనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒక్క స్కిల్ డెవలప్ మెంట్ కేసే ఇంకా తేలనప్పుడు.. ఇన్ని కేసులు ఎప్పటికి తేలతాయనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి స్కిల్ డెవలప్ మెంట్ కేసు తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి సీఐడీ ఎక్కువ వర్క్ చేసినట్టుంది. అంగళ్లు కేసులో పోలీసులే ఆధారాలు సేకరించారని చెబుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ, చంద్రబాబు వేసే పిటిషన్ల సంగతి పక్కనపెడితే.. అసలీ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ నాట్ బిఫోర్ మీ స్టేజ్ లో ఉంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఒక్కటే అయినా.. ఇప్పటికీ పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలౌతున్నాయి. అసలు ఓ పిటిషన్ మీద విచారణ జరుగుతుండానే.. మరో పిటిషన్ వేసేస్తున్నారు. దీంతో ఈ పిటిషన్ల పరంపరకి అంతెక్కడ అనేది తేలడం లేదు. చంద్రబాబు కి మూడోసారి కూడా రిమాండ్ విధించారు. ఓవైపు న్యాయపోరాటం సాగుతూనే ఉంది. మరోవైపు కొత్త కేసులు చుట్టుముడుతున్నాయి. ఈ లెక్కన ఈ వ్యవహారం తేలేదెప్పుడనే స్వరం పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో వినిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు విచారణ ఎంతకాలం జరుగుతుందనే విషయం ఎవ్వరూ చెప్పే పరిస్థితి లేదు. కానీ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై, ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై జరిగే విచారణ మాత్రం కీలకమని చెబుతున్నారు. ఆ విచారణలు పూర్తయితే కానీ.. ఎంత సమయం అనేది చెప్పలేమంటున్నారు న్యాయనిపుణులు.