Google Lens: గూగుల్ లెన్స్ అదుర్స్.. ఫోటో ద్వారా గమ్యస్థానానికి చేరేలా సరికొత్త ఫీచర్స్..!
మనకు ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకోవాలంటే ఒకప్పడు విషయ పరిజ్ఞానం ఉన్న వారినో, ఆ అంశం పై అవగాహన ఉన్న వారినో అడిగి తెలుసుకుంటాం. అలాకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క విషయానికి గూగుల్ తల్లిని అడగడం ప్రారంభించారు.
దీనికి చిన్న పెద్ద అనే తేడా అస్సలు లేదు. కొద్దిగా మొబైల్ ఆపరేటింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు ఇలా చేసేస్తున్నారు. అందులో సమాచారాన్ని ఎవరో ఒకరు భద్రపరుస్తారు అనే అంశాన్ని మరిచి గురువుకు ప్రత్యమ్నాయంగా గూగుల్ ని ఉపయోగిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే తాజాగా వచ్చిన సాంకేతికతతో గూగుల్ పోటీపడి తన విస్తృతిని పెంచుకుంటుంది. అందులో భాగంగా వచ్చిన సరికొత్త ఫీచరే గూగుల్ లెన్స్. ఈ లెన్స్ ను ఎన్నిరకాలుగా ఉపయోగించవచ్చు.. ఇది ఎలా పనిచేస్తుంది అనే సమగ్ర వివరాలు చూద్దాం.
విషయ ప్రాధాన్యం తోపాటూ భాషా ప్రావిణ్యం
ఒకప్పుడు సబ్జెక్ట్ కోసం సర్చ్ ఇంజన్ మీద తెగ పడిపోయేవాళ్లు. కానీ.. ఇప్పుడు గూగుల్ లెన్స్ మీద పడుతున్నారు. ఈ లెన్స్ లో మనకు కావలసిన వివరాలకు సంబంధించిన ఫోటోను పొందుపరిస్తే చాలు అదే అన్ని వివరాలను అందిస్తుంది. అందులోని రకాలను కూడా వివరిస్తుంది. ఇంతగా మారిపోయింది దీని టెక్నాలజీ. ఇంతేకాకుండా ఏదైనా మనకు అర్థం కాని, తెలియని భాషలో ఉంటే ఆ చిత్రాన్ని తీసి గూగుల్ లెన్స్ కి జతచేస్తే మనకు కావల్సిన భాషను ఎంచుకునే ఆప్షన్ ను ఇస్తుంది. తద్వారా అర్థం కాని భాషను మనకు నచ్చిన, ఇష్టమైన భాషలోకి తర్జుమా చేసుకోవచ్చు.
చర్మ వ్యాధులను గుర్తించేలా అప్డేట్
అందులో భాగంగానే మన చర్మం పై ఉన్న వ్యాధులను కనుగొనేందుకు, తద్వారా కొన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. మన శరీరం భాగాలపై ఏర్పడిన ఏవైనా చర్మ వ్యాధులను, వాటి తీవ్రతను కనుగొనేందుకు దోహదపడుతుంది. ఎక్కడైతే చర్మ సమస్య ఉందో ఆ భాగాన్ని ఫోటో తీసి గూగుల్ లెన్స్ కి అనుసంధానం చేస్తే చాలు. దాని తీవ్రతను, పేరును, లక్షణాలను, తదితర వివరాలను మీకు క్షణాల్లో అందిస్తుంది. ఇలా చేయడం వల్ల వ్యాధిపై అవగాహన కలిగి వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటారు సదరు బాధితుడు. ఈ స్మార్ట్ టెక్నాలజీని కేవలం ప్రాదమిక నిర్థారణకు మాత్రమే వాడుకోవాలి. అలా కాకుండా దీనిని నమ్ముకొని వ్యాధిపై నిర్లక్ష్యం చేసినా, దీని ప్రకారం చికిత్స తీసుకున్నా లేనిపోని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
ఫోటో ద్వారా గమ్యస్థానం చేరవచ్చు
ఈ లెన్స్ ఏఆర్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఏఆర్ అంటే అగ్మెంటెడ్ రియాలిటీ అనమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే వాస్తవానికి దగ్గరగా ఉండేది అని అర్థం. మనం ఏదైనా వస్తువులతోనో, అక్షరాలతోనో కూడిన ఫోటో పెట్టామంటే వాటికి చాలా దగ్గరగా ఉండే సమాచారాన్ని అందించేలాగా సూక్ష్మ దృష్టిలో గ్రహిస్తుంది. రానున్న రోజుల్లో గూగుల్ మ్యాప్ ను కూడా అనుసంధానించే పనిలో ఉంది ఈ సంస్థ. దీనికోసం ఈ ఏఆర్ సాంకేతికత చాలా అవసరం అవుతుంది. ఇది విజయవంతం అయితే మాత్రం ఇక తిరుగుండదనే చెప్పాలి. ఎందుకంటే మనకు కావల్సిన రెస్టారెంట్ల ఫోటోలు, షాపింగ్ మాల్స్, గుళ్లు, ఫ్రెండ్స్ ఇంటి ఫోటోలు పెడితే చాలు నేరుగా అక్కడికి వెళ్లేలా గూగుల్ లెన్స్ సహాయంతో మ్యాప్ ఆక్టివ్ అవుతుంది. తద్వారా ప్రత్యేకంగా అడ్రస్ నమోదు చేయనవసరం ఉండదు.
T.V.SRIKAR