Rebekah Drame: ఈ సూచనలు పాటిస్తే చాలు.. కన్సల్టెన్సీలు అవసరం లేకుండా అమెరికా ప్రయాణం..!
అమెరికా.. అమెరికా.. అమెరికా ఈ డైలాగ్ హ్యాపీడేస్ సినిమాతో తెలగ పాపులర్ అయింది. అయితే తాజాగా మన విద్యార్థులు అక్కడికి వెళ్లి పడ్డ అవస్థలు, ఇండియాకి తిరుగు ప్రయాణాలతో మళ్ళీ అందరినోట ఈ మాట వినబడుతోంది. ఇలా ఇబ్బందులు పడకుండా యూఎస్ ఎడ్యూకేషన్ సంస్థ కొన్ని ప్రత్యేకమైన సదస్సులను ఏర్పాటు చేసింది. దీని ముఖ్య ఉద్ద్యేశ్యం ఏంటో ఇప్పుడు చేద్దాం.
అసలు అమెరికా కి ఎందుకు వెళ్తారు. సరైన విద్య, పెద్ద ఉద్యోగం, పెద్ద సంఖ్యలో జీతం ఈ మూడింటి కోసమే ఖండాలు దాటి అక్కడికి వెళ్తున్నారు. ఇది అందరూ చెప్పే మాట. అయితే అందరూ ఇందుకోసమే వెళ్ళరు. ఇతరితర వ్యక్తిగత పనుల మీద కూడా వెళ్తూ ఉంటారు. వీరి గురించి పెద్ద సమస్యలేదు. కేవలం చదువుకునేందుకు, అక్కడ ఉన్నత ఉద్యోగం చేసుకుని స్థిర పడేవారికే అన్ని నియమనిబంధనలు ఉన్నాయి. అలా స్థిరపడాలనుకునే వారు చేసే ప్రయత్నాలలో మొదటిది కన్సెల్టెన్సీలను సంప్రదించడం. అందులో కొన్ని ఖచ్చితమైన వివరాలు తీసుకొని విదేశాలకు పంపించే కన్సెల్టెన్సీలు ఉంటాయి. మరికొన్ని తప్పుడు ధృవపత్రాలను తయారు చేసి పంపించేందుకు ప్రయత్నం చేస్తాయి. దీనికి గానూ లక్షల్లో వసూలు కూడా చేస్తాయి. ఉత్సాహం కలిగిన వారు ఎంతైన ఖర్చు చేసి అమెరికాకి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. అలాంటి వారినే ఎరగా చేసుకొని కన్సెల్టెన్సీలు రెచ్చిపోతున్నాయి.
తాజాగా వెనుదిరిగిన విద్యార్థులు కూడా అలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళే. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ మన దేశంలో కొన్ని అమెరికాకి సంబంధించిన సమగ్ర సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు యూఎస్ కాన్సుల్ జనరల్, వీసా అధికారి రెబెఖా డ్రేమ్ చెప్పారు. కరోనా తరువాత కాన్సులేట్ లో ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకొని వీసా ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అమెరికా వెళ్లాలనే ఆసక్తి కలిగిన వారి కోసం హైదరాబాద్ హైటెక్స్ వేదికగా శనివారం ఒక ప్రత్యేకమైన ఫెయిర్ ను నిర్వహించారు. దీనిని యూఎస్ ఇండియా ఎడ్యూకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 40 వర్సిటీల ప్రతినిధులు హాజరైయ్యారు. వీరు నేరుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలు, సలహాలు, సూచనలు, సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రెబెఖా కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు.
ఇండియా నుంచి అమెరికా వెళ్లే వాళ్ల కోసం కల్పించిన సౌకర్యాలు ఇవే..
- హైదరాబాద్ సహా ప్రముఖ నగరాల్లో యూఎస్ ఇండియా ఎడ్యూకేషన్ ఫౌండేషన్ కేంద్రాలు ఏర్పాటు.
- అమెరికా విద్య, ఉద్యోగం విషయంలో ఎలాంటి సందేహాలున్నా అడిగి తెలుసుకోవచ్చు.
- 24/7 టోల్ ఫ్రీ నంబరు కూడా ఏర్పాటు చేశారు.
- 18001031231 కి కాల్ చేసి కూడా మీ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవచ్చు.
- అధికారిక వెబ్ సైట్ లేదా ఫేస్ బుక్ లో ఎడ్యూకేషన్ యూఎస్ఇండియాను ఫాలో అవ్వచ్చు.
ఈ పైన తెలిపిన మాధ్యమాల ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు.
ఒరిజినల్ డాక్యూమెంట్లే కీలకం
ఇండియా నుంచే కాకుండా ఏ ఇతర దేశాల నుంచైనా అమెరికా వచ్చే వాళ్లు తమతో పాటూ ఒరిజినల్ ధృవపత్రాలను తమ వెంట తెచ్చుకోవాలి. ఇమిగ్రేషన్ అధికారులు అడిగిన వాటికి సరైన సమాధానంతో పాటూ అవసరమైన డాక్యూమెంట్స్ చూపించాలి. నిజాయితీగా వ్యవహరించాలి. ఒకవేళ ఇమిగ్రేషన్ ప్రక్రియ విజయవంతంగాపూర్తైనప్పటికీ.. ఎప్పుడైనా ఎక్కడైనా అనుమానం వచ్చి తనిఖీ చేసినప్పుడు ఏదైనా కొంచం తేడా వచ్చినా వారిని తక్షణమే తమ స్వదేశానికి పంపిస్తారు. అందుకే మీకు సంబంధించిన ప్రతి ఒక్క ధ్రువపత్రాన్ని భద్రపరుచుకోవాలి. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వానికి చెల్లించిన సెవిస్, వీసా అప్లికేషన్ ఈ రెండు రకాలా ఫీజులు చెల్లించిన వివరాలు తమ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందులో కూడా సెవిస్ ఫీజు 350 డాలర్లు, వీసా అప్లికేషన్ ఫీజు 185 డాలర్లు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.
మరి కొన్ని ముఖ్య నగరాల్లో అవగాహనా సదస్సులు
విద్యార్థులు అమెరికాలో అడుగు పెట్టిన తరువాత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మన దేశ వ్యాప్తంగా ప్రదాన పట్టణాలైన ముంబై, పూణె,ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్ కత్తా, చెన్నై, బెంగళూరులో ఈ సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ముగుస్తుంది.
T.V.SRIKAR